విధాత, ప్రత్యేక ప్రతినిధి: సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ గురువారం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను సందర్శించారు. ఈ సందర్భంగా తన ఎత్తు బంగారం సమర్పించారు. నారాయణ తమ పార్టీ నాయకులతో కలసి మేడారం సందర్శించారు. ఈ సందర్భంగా ములుగులో డాక్టర్ కె. నారాయణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్కను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క నారాయణను శాలువాతో సత్కరించారు. అనంతరం తాడ్వాయి మండలం లోని మేడారాన్ని నారాయణ సందర్శించి లక్షలాది మంది దర్శించుకునే జాతర ప్రాంతాన్ని పరిశీలించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జాతర పునరుద్ధరణ పనులను పరిశీలించి, భక్తులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్ కె నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ. 251 కోట్లు ఖర్చు చేసి జాతర పునరుద్ధరణ పనులు చేపట్టడం సంతోషకరమని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని సూచించారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారానికి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం నిధులను కేటాయించక పోవడం సరికాదని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న జాతర పట్ల వివక్ష కేంద్రానికి సరికాదని సూచించారు. సమ్మక్క-సారలమ్మ లు స్వేచ్ఛా, సమానత్వం కోసం, శాంతి, ఐకమత్యం కోసం పోరాడిన వీరవనితలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. విజయ సారధి,రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, ములుగు జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్, నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
TVK Vijay | విజయ్ పార్టీ టీవీకే ఎన్నికల సింబల్ ‘విజిల్’
Wireless Electricity Transmission | వైర్లు వాడకుండానే విద్యుత్ సరఫరా.. సాకారం చేసే దిశగా అడుగులు
