- ముందే బయటకు రావాల్సింది
- కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేస్తే కేసీఆర్‌కు డిపాజిట్లు రావు
- నిశ్చితార్దం స్టేజ్ లో కూటమి
- బాబు బిజెపి ఊగిసలాట నుంచి బయటకు రావాలి
- సీపీఐ జాతీయ నేత నారాయణ
CPI Narayana | విధాత: బీఆరెస్‌కు మద్దతు ఇచ్చి తప్పు చేశామని సీపీఐ జాతీయ నాయకులు నారాయణ అన్నారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ, ఏపీ రాజకీయాల పై సంచలన వాఖ్యలు చేశారు. మునుగోడు ఎన్నికలలో బీజేపీ కి వ్యతిరేకంగా బీఆరెస్‌కు మద్దతు ఇచ్చామన్నారు. ఇపుడు రాజకీయ పరిస్థితులు మారాయని తెలిపిన నారాయణ బీఆరెస్‌కు మద్దతు ఇచ్చి తప్పు చేశామన్నారు. కేసీఆర్ నుంచి తాము ఇంకొంచెం ముందు బయట పడాల్సిందన్నారు.
ప్రతిపక్షాల సమావేశాలకు కేసీఆర్ రాలేదన్నారు. పైగా ఎంఐఎంతో కలిసి మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తారట అని ఎద్దేవా చేశారు. తెలంగాణ లో కాంగ్రెస్ సీపీఐ కలిసి కూటమిగా పోటీ చేస్తే కేసీఆర్ కు డిపాజిట్లు రావని అన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ కామ్రేడ్ల కూటమి నిశ్చితార్దం స్టేజ్ లో ఉందన్నారు. చర్చలు జరుగుతున్నాయన్న నారాయణ కాంగ్రెస్, కమ్యూనిస్ట్‌లు కలిసి పని చేస్తే ఓట్లు ట్రాన్సఫర్ అవుతాయన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని నారాయణ అన్నారు. నాయకులు లోపల బయట నాయకులు కొట్టుకుంటారని వ్యాఖ్యానించారు. పార్టీల మధ్య రాష్ట్రాల్లో విభేదాలు, అయినా జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉంటామని తెలిపారు. తమకు ఓట్ల లెక్కలు ముఖ్యం కాదని, రాజకీయ అవగాహన ముఖ్యమన్నారు. ఓట్ల లెక్కలు కాకుండా, పార్టీల మధ్య అవగాహన అవసరంమని తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో విపక్ష పార్టీలన్నీ కలిసి ఒక ఫ్రంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నారాయణ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ ఊగిసలాట నుంచి బయటకు రావాలన్నారు. ఏపీలో జైలులో ఉన్న వారు, కేసుల్లో ఉన్న అధికారులు ప్రభుత్వంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. తిరుమల కొండపైన లిక్కర్ నిషేధించారని, కానీ లిక్కర్ అమ్మే వాడిని కొండపైకి పంపారని ఎద్దేవా చేశారు.
మాంసం అమ్మే వాళ్ళకు టిటిడి మెంబర్లు గా ఇచ్చారని, వెంకటేశ్వర స్వామి బ్రతికి ఉంటే, చచ్చి పోయే వారన్నారు.