Over Draft | ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి? దీని వల్ల లాభాలు ఏంటి?

మీ బ్యాంకు ఖాతాలో చిల్లిగవ్వ లేదు.... అయినా కూడా మీకు సమయానికి బ్యాంకు డబ్బులు అందిస్తుందనే విషయం తెలుసా? దీన్నే ఓవర్ డ్రాఫ్ట్ ఓడీ అంటారు. ఓడీ అందరూ తీసుకోవచ్చా? వడ్డీ ఎంతుంటుంది? ఎప్పుడు దీన్ని చెల్లించాలి? ఓడీ మంజూరుకు ముందు బ్యాంకులు ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయనే విషయాలను తెలుసుకుందాం.

మీ బ్యాంకు ఖాతాలో చిల్లిగవ్వ లేదు…. అయినా కూడా మీకు సమయానికి బ్యాంకు డబ్బులు అందిస్తుందనే విషయం తెలుసా? దీన్నే ఓవర్ డ్రాఫ్ట్ ఓడీ అంటారు. ఓడీ అందరూ తీసుకోవచ్చా? వడ్డీ ఎంతుంటుంది? ఎప్పుడు దీన్ని చెల్లించాలి? ఓడీ మంజూరుకు ముందు బ్యాంకులు ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయనే విషయాలను తెలుసుకుందాం.

ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి?

మీ బ్యాంకు ఖాతాలో ఒక్క పైసా లేకున్నా అవసరానికి డబ్బులు సర్దుబాటు కావడమే ఓవర్ డ్రాఫ్ట్. ఒక రకంగా చెప్పాలంటే ఓడీ అంటే తప్పనిసరి క్రెడిట్ సదుపాయం. వ్యాపారులు ఉపయోగించే కరెంట్ ఖాతాలే కాదు సాధారణంగా శాలరీ ఖాతాలు కలిగిన వారు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఇది స్వల్పకాలిక రుణ ఆఫ్షన్. అత్యవసర ఆర్ధిక పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వరంగ బ్యాంకైన ఎస్ బీఐ, ఐసీఐసీఐ వంటి ప్రైవేట్ బ్యాంకులు కూడా ఓడీ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

ఓవర్ డ్రాఫ్ట్ ఎంతైనా తీసుకోవచ్చా?

ఓవర్ డ్రాఫ్ట్ ఎంతైనా తీసుకొనే అవకాశం లేదు. మీరు ఉపయోగించే ఖాతా, మీ ఆర్ధిక పరిస్థితులు, బ్యాంకు నిబంధనలు, మీ క్రెడిట్ స్కోర్ తో పాటు ఇతర అంశాలు ఓవర్ డ్రాఫ్ట్ ను నిర్ణయిస్తాయి. కరెంట్ ఖాతా, పొదుపు ఖాతాలకు వేర్వేరుగా ఓడీ ఉంటుంది. కరెంట్ ఖాతాలకు ఎక్కువ మొత్తంలో ఓడీ తీసుకొనే వెసులుబాటు ఉంటుంది. శాలరీ ఉద్యోగులైతే తాము తీసుకొనే జీతానికి మూడు రెట్లు అదనంగా కూడా ఓడీ తీసుకొనే అవకాశం ఉంది. ఓడీపై ప్రతి రోజూ వడ్డీని లెక్కిస్తారు. ఓడీ తీసుకొనే సమయంలో ముందస్తు చెల్లింపు చేయాల్సిన అవసరం లేదు. ఓవర్ డ్రాఫ్ట్ నకు సంబంధించిన ముందస్తు చెల్లింపు చేయడంలో విఫలమైతే అప్పుడు వడ్డీ మొత్తాన్ని నెలాఖరులో అసలుకు మొత్తాన్ని జోడిస్తారు. అనంతరం మొత్తం అసలుపై వడ్డీని లెక్కిస్తారు.

ఓడీకి పూచీకత్తు పెట్టాలా?

ఓడీ(Over Draft) ఇచ్చేందుకు చాలా బ్యాంకులు ఏదైనా పూచీకత్తును అడుగుతున్నాయి. కొన్ని బ్యాంకులు ఎలాంటి పూచీకత్తు లేకుండానే ఓడీ ఇస్తున్నాయి. అయితే ఖాతాదారుడి క్రెడిట్ హిస్టరీ ఆధారంగా కొన్ని బ్యాంకులు ఓడీని ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఓడీలు మంజూరు చేస్తున్నాయి. ఇంటిని పూచీకత్తుగా చూపితే కూడా ఓడీ ఇస్తున్నాయి కొన్ని బ్యాంకులు. అయితే ఆ ఇంటి విలువను బ్యాంకులు ముందుగా నిర్ణయిస్తాయి. హౌసింగ్ లోన్లు చెల్లించేందుకు కూడా ఓడీ తీసుకోవచ్చు. మీరు మీ బీమా పాలసీని మీ ఓవర్‌డ్రాఫ్ట్‌నకు కొలేటరల్‌గా ఉంచుకుంటే మంజూరు చేసిన మొత్తం మీ బీమా పాలసీ సరెండర్ విలువపై ఆధారపడి ఉంటుంది. బీమా పాలసీ లోన్-టు-వాల్యూ, ఫిక్స్‌డ్ డిపాజిట్ల లోన్ టూ వాల్యూకు దాదాపు సమానంగా ఉంటుంది. అంటే మీరు మీ బీమా పాలసీని ఫిక్స్‌డ్ డిపాజిట్ కి బదులుగా ఉంచుకుంటే దాదాపు అదే మొత్తాన్ని మంజూరు చేయవచ్చు. బ్యాంకుల్లో శాలరీ ఖాతాలు కలిగిన ఉద్యోగులు వారి జీతాలకు ప్రతిగా ఓవర్‌డ్రాఫ్ట్‌లను కూడా అందిస్తాయి. మీరు మీ జీతం కంటే 2-3 రెట్లు ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిని పొందవచ్చు. కానీ ఇది రుణదాత నుండి రుణదాతకు మారుతుంది. షేర్స్ ను కూడా పూచీకత్తుగా పెట్టి ఓడీ పొందవచ్చు. అయితే షేర్స్ విలువ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. అందుకే షేర్స్ పూచీకత్తుగా పెడితే ఓడీ తక్కువగా వస్తుంది.

వడ్డీ రేటు ఎంత?

ఓవర్ డ్రాఫ్ట్ కు వడ్డీరేటు ఆయా బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థల ఆధారంగా ఉంటుంది. మీరు తీసుకున్న ఓడీ రకం, బ్యాంకు విధానాలు, ఖాతాదారుడి క్రెడిట్ హిస్టరీ వంటి అంశాలు కూడా వడ్డీరేటును ప్రభావితం చేస్తాయి. ఈఎంఐ తరహాలో ఓడీ చెల్లించాల్సిన అవసరం లేదు. మీ దగ్గర డబ్బులున్నప్పుడు ఓడీ చెల్లించే వెసులుబాటు ఉంటుంది. మీకు వెసులుబాటు ఉన్న సమయంలో మీ వద్ద ఉన్న నగదును చెల్లించే వెసులుబాటు ఉంది. ఓడీని ఎక్కువ కాలం చెల్లించకుండా ఆలస్యం చేయవద్దు. ఇలా చేస్తే అది మీ సిబిల్ స్కోర్ పై ప్రభావం చూపిస్తుంది.

Latest News