Site icon vidhaatha

Global Trade War | అమెరికాకు చైనా రిటార్ట్‌.. శనివారం నుంచి ఆ దేశ గూడ్స్‌పై 125 శాతం టారిఫ్‌లు

Global Trade War | ప్ర‌పంచ‌వాణిజ్య యుద్ధం కొత్త పుంత‌లు తొక్క‌తున్న‌ది. అమెరికా విధిస్తున్న టారిఫ్‌ల‌కు అంతే దీటుగా చైనా బ‌దులిస్తున్న‌ది. ఇప్ప‌టిదాకా అమెరికా ఉత్ప‌త్తుల‌పై 84 శాతం సుంకాలు విధించిన చైనా.. శ‌నివారం నుంచి వాటిని 125 శాతానికి పెంచ‌నుంద‌ని చైనా ఆర్థిక వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ రాయిట‌ర్స్ వార్తా సంస్థ శుక్ర‌వారం పేర్కొన్న‌ది. త‌న టారిఫ్‌ల అమ‌లును ట్రంప్ 90 రోజుల‌పాటు వాయిదా వేసిన‌ప్ప‌టికీ.. చైనాకు మాత్రం ఆ స‌డ‌లింపు వ‌ర్తింప‌జేయ‌లేదు. పైగా చైనాపై 145 శాతం సుంకాలు విధించింది. ఈ నేప‌థ్యంలో అమెరికాకు రిటార్ట్ ఇస్తూ త‌న సుంకాల‌ను చైనా పెంచేసింది.

‘చైనాపై అధిక మొత్తంలో అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు అంతర్జాతీయ, ఆర్థిక ఒప్పందాల నిబంధ‌న‌ల‌కు, క‌నీస ఆర్థిక చ‌ట్టాల‌ను, కామ‌న్‌సెన్స్‌ను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయి. ఏక‌ప‌క్షంగా మ‌మ్మ‌ల్ని బెదిరించేందుకు, ఒత్తిడి పెంచేందుకు ఉద్దేశించిన‌వి’ అని చైనా ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా. అంతేకాదు.. అమెరికాకు అత్యధిక ఎగుమతులు చేసే దేశాల్లో రెండో అతిపెద్ద దేశం. చైనాపై మరిన్ని టారిఫ్‌లు విధిస్తామని ఈ వారం మొదట్లోనే అమెరికా సంకేతాలు ఇచ్చింది. వాటిని ఇప్పుడు అమల్లోకి తెచ్చింది. ‘ప్రతీకార సుంకాలుగా చెబుతున్న ఈ టారిఫ్‌లను ఉపసంహరించేందుకు అమెరికా ఒక పెద్ద ముందడుగు వేయాలని చైనా కోరుతున్నది. పూర్తిగా తప్పుడు విధానాలైన వీటిని ఉపసంహరించాలని కోరుతున్నది’ అని చైనా ఆర్థిక శాఖ ఆ ప్రకటనలో పేర్కొన్నది. ఇదిలా ఉంటే.. అమెరికా టారిఫ్‌లకు వ్యతిరేకంగా అదనపు ఫిర్యాదులను ఫైల్‌ చేసినట్టు ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా మిషన్‌ శుక్రవారం తెలిపింది.

Exit mobile version