Site icon vidhaatha

త్వరలో మెగా ఐపిఓలు ‌‌: హ్యూండయ్‌ ​, ఎన్​టీపీసీ గ్రీన్​, స్విగ్గీ – సిద్ధంగా ఉండండి

హ్యూండయ్మోటార్ ఇండియా(Hyundai Motor India): దేశంలోనే మారుతి తర్వాత రెండో అతిపెద్ద కార్ల​ తయారీదారు హ్యూండయ్‌ మోటార్‌ ఇండియా రూ.25,000 కోట్ల పబ్లిక్‌ ఇష్యూ ప్రతిపాదనకు  సెబీ అనుమతించింది. దీంతో దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా ఇది రికార్డు సృష్టించనుంది. హ్యూండయ్‌ మోటార్ ఇండియా ఐపీఓ మొత్తం ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌’ (Offer for Sale) పద్ధతిలో జరగనుంది. ఐపీఓలో భాగంగా 14,21,94,700 ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. అక్టోబర్​ 14న హ్యూండయ్‌  ఐపీఓ రానుంది. కానీ, ఇది పెద్ద లాభకరం కాదని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఆటోమొబైల్​ పరిశ్రమ ప్రస్తుతం గడ్డు పరిస్థితిలో ఉందని, భారతీయ మదుపరులు దీనిపై ఆసక్తి చూపక పోవడమే మంచిదని వారంటున్నారు.

ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ(NTPC Green Energy Ltd) : కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ ఉత్పాదక సంస్థ అయిన ఎన్​టీపీసీ తన అనుబంధ సంస్థ ఎన్​టీపీసీ గ్రీన్ ఎనర్జీ కోసం రూ. 10 వేల కోట్లను సమీకరించేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 3.2 గిగా వాట్ల(3.2GW) గ్రీన్​ పవర్​ ఉత్పాదకత కలిగిన ఈ సంస్థ, ఇందులో 3.1 గిగావాట్లు సౌర విద్యుత్​ ద్వారా, 100 మెగావాట్లు గాలిమరల ద్వారా విద్యుత్​ను తయారుచేస్తోంది. దీన్ని 2032 కల్లా19 రెట్లు పెంచుకుని 60 గిగావాట్ల(60 GW)కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్​ మొదటి వారంలోనే ఈ కంపెనీ ఐపీఓకు రానుంది. ఈ ఐపిఓకు మంచి డిమాండ్​ ఉంది.

స్విగ్గీ (Swiggy): ఈ ఐపీఓ ద్వారా రూ.11,850 కోట్లు సమీకరించాలని స్విగ్గీ అనుకుంటోంది. ఇందులో రూ.3,750 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా, మిగిలిన రూ.8400 కోట్లు ఆఫర్‌ ఫర్​ సేల్‌(OFS) పద్ధతిన విక్రయించనున్నారు. స్విగ్గీ ఐపీఓ నవంబర్​లో ఉండొచ్చని మార్కెట్​వర్గాల సమాచారం.

త్వరలో ఇతర ఐపీఓలు(Other IPOs):  షాపూర్​జీ పల్లోంజీ గ్రూప్​నకు చెందిన ఇంజినీరింగ్, నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(Afcons Infrastructure) ఐపీఓ ద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధమైంది. వారీ ఎనర్జీస్(Waaree Energies) కొత్త షేర్ల​ ఇష్యూ ద్వారా రూ.3వేల కోట్ల సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఆఫర్​ ఫర్​ సేల్​ పద్ధతిలో విక్రయించే షేర్లు దీనికి అదనం. ఇంకా నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్, వన్​ మొబిక్విక్​ సిస్టమ్స్ వరుసగా రూ.3 వేల కోట్లు, రూ.700 కోట్ల సమీకరించాలని చూస్తున్నాయి. ఇవి కాక,  50కిపైగా సంస్థలు తన ఐపిఓలకు సెబీ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి.

 

Exit mobile version