Indian Rupee Hits All-Time Low | న్యూఢిల్లీ : భారతీయ కరెన్సీ రూపాయి విలువ ముందెన్నడు లేనంత ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. రూపాయి విలువ శుకరవారం ఆల్‌టైం కనిష్ట స్థాయి 87.9650కు పడిపోయింది. దీంతో ప్రతిపక్షాలు ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తానొచ్చాక రూపాయి విలువ పెంచుతానని గతంలో మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తు సెటైర్లు వేస్తున్నారు. అమెరికా వాణిజ్య సుంకాల పెంపు దెబ్బకు ఇన్వెస్టర్ల ఆందోళన, చమురు ధరలు, డాలర్ బలపడటం వంటి కారణాల మధ్య రూపాయి విలువ పడిపోవడానికి కారణమైందని తెలుస్తుంది. భారత్ నుంచి వచ్చే వస్తువులపై ఇటీవల 25% సుంకాన్ని విధించిన అమెరికా ప్రభుత్వం ఆ మొత్తాన్ని 50% కు రెట్టింపు చేసింది. ఇది మార్కెట్ లో రూపాయి విలువకు ప్రతికూలంగా మారింది. డాలర్ తో రూపాయి మారక విలువ ఏడాది కాలంలో 4.24% పడిపోయింది.
టారిఫ్‌ల పెంపు ప్రభావం డాలర్- రూపాయి మారక విలువ క్షీణత వరకే పరిమితం కాకుండా.. ఇతర దేశాల కరెన్సీతో కూడా ఇండియన్ రూపాయి మారక విలువ పడిపోయింది. ఆఫ్‌షోర్ చైనీస్ యువాన్‌తో పోలిస్తే, రూపాయి విలువ మరింత క్షీణించి, 12.3307 ను తాకింది. ఇది వారంలోనే 1.2%, నెలలో 1.6% క్షీణతను సూచిస్తుంది. గత నాలుగు నెలలుగా రూపాయి మారకం విలువ యువాన్ తో పోలిస్తే దాదాపు 6 శాతం క్షీణించింది.