e-Visa | భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ‘ఈ-వీసా’ విధానం తీసుకువచ్చిన జపాన్‌

  • Publish Date - April 4, 2024 / 09:19 AM IST

e-Visa | భారతీయులకు జపాన్‌ శుభవార్త చెప్పింది. పర్యాటకులను ఆకర్షించే ఉద్దేశంతో ‘ఈ-వీసా’ విధానాన్ని ప్రవేశపెట్టింది. దాంతో పర్యాటకులు తమ పాస్‌పోర్టుల్లో ఫిజికల్‌ స్టిక్కర్స్‌ అవసరం లేకుండా సరికొత్త విధానం ప్రవేశపెట్టింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. భారతీయ పర్యాటకులు ఆన్‌లైన్‌లోనే వీసా కోసం దరఖాస్తు చేసుకునే వీలున్నది. వీఎఫ్ఎస్ గ్లోబల్ ద్వారా నిర్వహిస్తున్న జపాన్ వీసా అప్లికేషన్ సెంటర్లలో దరఖాస్తు పర్యాటకులు దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉన్నది. పర్యాటకుల కోసం తీసుకువచ్చిన ఈ-వీసా ప్రోగ్రామ్‌లో గరిష్ఠంగా జపాన్‌లో 90 రోజులు వరకు పర్యటించేందుకు వీలుంటుంది. అయితే, జపాన్‌లోకి ఒకేసారి మాత్రమే ప్రవేశించే అవకాశం ఉంటుంది. అర్హత ఉన్న భారతీయులతో పాటు భారత్‌లో నివసిస్తున్న విదేశీయులు సైతం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.

దరఖాస్తు ఎలా చేయాలంటే.. మొదట జపాన్‌ వీసా అధికారిక వెబ్‌సైట్‌ visa.vfsglobal.com/ind/en/jpn/ లోకి లాగిన్‌ కావాలి. అక్కడ అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వివరాలు నమోదు చేయాలి. ఫొటోలతో సహా అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అప్లికేషన్‌ను సమర్పించేందుకు అపాయింట్‌మెంట్‌ తేదీని సైతం సెలెక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత అపాయింట్‌మెంట్ లెటర్‌ ఈ-మెయిల్‌కి వస్తుంది. అపాయింట్‌మెంట్‌ రోజు వెళ్లి దరఖాస్తును అందజేయాలి. ఆ తర్వాత నిర్ణయం తెలుపుతుంది. అప్పటి వరకు స్టేటస్‌ని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకునే వీలుంటుంది. వీసా జారీ అయితే దరఖాస్తులకు ఎలక్ట్రానిక్ వీసా జారీ అవుతుంది. ప్రయాణ సమయంలో ఎయిర్‌పోర్టుల వద్ద చెక్-ఇన్ సమయంలో తమ డివైజ్‌లోని ఈ వీసా చూపించాలి. ఈ-వీసాపై ఉన్న డిస్‌ప్లే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది.

Latest News