Ratan Tata | భారత దేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. భారత దేశ రత్నంగా పిలుచుకునే పారిశ్రామికవేత్త సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి అయిన తనదైన సింప్లిసిటీతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. తన పదవీకాలంలో టాటా గ్రూప్స్ (Tata Group)కు అపూర్వ విజయాలను అందించారు. అదే సమయంలో దాతృత్వానికి పర్యాయపదంగా మారారు. రతన్ టాటా జంతుప్రేమికుడు. ఆయనకు కుక్కలంటే ఎనలేని మక్కువ. ఆయన గోవా అనే కుక్కను దత్తత తీసుకున్నాడు. ఈ పెంపుడు జంతువుల కారణంగా ఆయన బ్రిటన్ రాజు చార్లెస్ (Prince Charles) నుంచి అవార్డును అందుకోలేకపోయారు. 2018 ఫిబ్రవరి 6న బ్రిటన్ రాజభవనమైన బకింగ్‌హామ్ ప్యాలెస్ (Buckingham Palace)లో ఓ కార్యక్రమం నిర్వహించారు.
బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ (ప్రస్తుత రాజు కింగ్ చార్లెస్-3) రతన్ టాటా చేసిన సేవలకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి రతన్ టాటా హాజరుకాలేదు. దానికి వెనుక కారణాలు తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఈ విషయాన్ని పారిశ్రామికవేత్త సుహైల్ సేథ్ కొద్దిరోజుల కిందట గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రతన్ టాటా గొప్పదనం, ఆయన మానవత్వాన్ని ఆయన ప్రశంసించారు. బ్రిటన్ రాజు చార్లెస్ బ్రిటీష్ ఏషియన్ ట్రస్ట్‌తో కలిసి ఈ అవార్డు వేడుకను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ఫిబ్రవరి 3న సుహైల్ సేథ్ లండన్‌కు చేరుకున్నారు. లండన్ విమానాశ్రయానికి చేరుకోగానే రతన్ టాటా నుంచి 11 మిస్డ్‌కాల్స్ వచ్చాయి. దాంతో ఆశ్చర్యానికి గురైన ఆయన తన బ్యాగ్‌ను ఎయిర్‌పోర్ట్‌లో కలెక్ట్ చేసుకొని తిరిగి టాటాకు ఫోన్ చేశారు. అవార్డు కార్యక్రమానికి తాను రాలేనని చెప్పారు.
తన పెంపుడు కుక్కలు టాంగో, టిటో అనారోగ్యానికి గురయ్యాయని.. దాంతో అవార్డుల కార్యక్రమానికి రాలేనని చెప్పినట్లు సుహైల్ సేథ్ గుర్తు చేసుకున్నారు. అది విని తాను ఆశ్చర్యపోయానని.. ప్రిన్స్ ఛార్లెస్ పేరు చెప్పి ఒప్పించేందుకు ప్రయత్నించినా ఆయన అంగీకరించలేదని.. అవార్డు కార్యక్రమానికి దూరమయ్యారన్నారు. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రిన్స్ ఛార్లెస్‌కు చెబితే ‘మనిషి ఇలాగే ఉండాలని.. రతన్ టాటా అద్భుతమైన వ్యక్తి. ఆయన ఈ స్థితిలో ఉండడానికి కారణం ఇదే’ అని చెప్పినట్లుగా సుహైల్ సేథ్ చెప్పుకొచ్చారు. అలాగే, ముంబయిలోని తాజ్ హోటల్‌లోకి వీధికుక్కలు వచ్చినా అడ్డుకోవద్దని వారికి రతన్ టాటా సిబ్బందికి సైతం ఆదేశాలు ఇచ్చారు. ఈ ఘటనలు ఆయన ఎంతటి మానవతాదో తెలిసిపోతుంది.