Credit Card Rules | ఐసీఐసీఐ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ వరకు మారిన క్రెడిట్‌కార్డ్‌ రూల్స్‌..! అవేంటో తెలుసుకుందాం రండి..!

Credit Card Rules | ప్రస్తుత కాలంలో క్రెడిట్‌కార్డుల వినియోగం భారీగా పెరిగింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైతం విరివిగా కార్డులను జారీ చేస్తున్నాయి. క్రెడిట్‌కార్డులతో ఎన్నో ప్రయోజనాలు ఉండడంతో పలువురు తీసుకునేందుకు మక్కువ చూపుతుంటారు. అయితే, తాజాగా పలు బ్యాంకులు క్రెడిట్‌కార్డులకు సంబంధించిన రూల్స్‌ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

  • Publish Date - July 1, 2024 / 10:30 AM IST

Credit Card Rules | ప్రస్తుత కాలంలో క్రెడిట్‌కార్డుల వినియోగం భారీగా పెరిగింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైతం విరివిగా కార్డులను జారీ చేస్తున్నాయి. క్రెడిట్‌కార్డులతో ఎన్నో ప్రయోజనాలు ఉండడంతో పలువురు తీసుకునేందుకు మక్కువ చూపుతుంటారు. అయితే, తాజాగా పలు బ్యాంకులు క్రెడిట్‌కార్డులకు సంబంధించిన రూల్స్‌ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మారిన నిబంధనలు నేటి కొన్ని అమలులోకి వస్తుండగా.. మరికొన్ని బ్యాంకులు త్వరలో అమలులోకి తీసుకురాబోతున్నాయి. ఈ జాబితాలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఎస్‌బీఐతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, సిటీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకులు నిబంధనలను మార్చాయి. రివార్డులతో పాటు ఇతర నిబంధనలను సవరించాయి. అవేంటో తెలుసుకుందాం రండి..!

ఐసీఐసీఐ బ్యాంక్

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డు మినహా మిగిలిన అన్ని క్రెడిట్ కార్డులపై రీప్లేస్‌మెంట్ ఛార్జీలను సవరించింది. రూ.100 నుంచి రూ.200 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. అయితే, డూప్లికేట్ స్టేట్ మెంట్ రిక్వెస్ట్, చెక్‌, క్యాష్‌ పికప్ ఫీజు, డయల్ ఏ డ్రాఫ్ట్, స్లిప్ రిక్వెస్ట్, ఔట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజులపై రుసుంను తొలగించింది. ఈ నిబంధనలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి.

ఎస్‌బీఐ

ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ ప్రభుత్వ సంబంధిత ట్రాన్సాక్షన్స్‌పై రివార్డు పాయింట్ల జారీని నిలిపివేయబోతున్నది. ఎస్‌బీఐ జారీ చేసిన పలు రకాల కార్డులపై నిబంధనలు నేటి నుంచి అమలులోకి వస్తుండగా.. మరికొన్ని రకాల కార్డులపై ఈ నెల 15 నుంచి అమలులోకి రానున్నాయి.

సిటీ బ్యాంక్

సిటీ బ్యాంక్‌ను యాక్సిస్‌ బ్యాంక్‌ టేకోవర్‌ చేసిన విషయం తెలిసిందే. సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌కార్డు అకౌంట్స్‌ జూలై 15 నాటికి యాక్సిస్‌ బ్యాంకులో విలీనం కానున్నాయి. దాంతో కొత్తగా యాక్సిస్ బ్యాంక్ పేరిట క్రెడిట్ కార్డులు జారీ చేస్తారు. అప్పటివరకు సిటీ బ్యాంక్ పేరుతో ఉన్న కార్డులు సైతం పని చేస్తాయని బ్యాంక్‌ పేర్కొంది. విలీనం సమయానికి సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల్లో ఉన్న రివార్డు పాయింట్లు ఎక్స్‌పైర్‌ కావని.. విలీనం అయ్యాక మూడేళ్ల వరకు గడువు ఉంటుందని బ్యాంక్‌ పేర్కొంది.

హెచ్‌డీఎఫ్‌సీ

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ థర్డ్‌ పార్టీ యాప్స్‌ నుంచి చేసే అద్దె చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయనున్నది. పేటీఎం, క్రెడ్‌, మొబిక్విక్‌, చెక్‌ తదితర యాప్స్‌ల ద్వారా జరిపే లావాదేవీలపై ఒకశాతం వరకు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. మారిన రూల్స్‌ ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలులోకి రాబోతున్నాయి.

Latest News