Site icon vidhaatha

Sensex Record | తొలిసారి 76 వేల మార్క్‌ను టచ్‌ చేసిన సెన్సెక్స్‌.. ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌లు

Sensex Record : బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ సోమవారం జీవనకాల గరిష్ఠాలను నమోదుచేసింది. ట్రేడింగ్‌ మధ్యలో ఒక దశలో 76 వేల మార్క్‌ను టచ్‌ చేసింది. సెన్సెక్స్‌ 76 వేల మార్కును టచ్‌ చేయడం ఇదే తొలిసారి. కాగా, దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు (Stock market) ఇవాళ ఫ్లాట్‌గా ముగిశాయి.

ఉదయం ఆసియా మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఇంట్రాడేలో భారీ లాభాల్లోకి వెళ్లాయి. ఈ క్రమంలో రెండు ప్రధాన సూచీలు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ఓ దశలో 600 పాయింట్ల మేర లాభపడిన సెన్సెక్స్‌.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో లాభాలన్నీ కోల్పోయి ఫ్లాట్‌గా ముగిసింది. నిఫ్టీ 22,900 ఎగువన ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 75,655.46 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 76,009.68 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను నమోదు చేసింది. చివరికి 19.89 పాయింట్ల నష్టంతో 75,390.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 24.65 పాయింట్లు కోల్పోయి 22,932.45 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.13గా ఉంది.

సెన్సెక్స్‌లో ఇండస్ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు లాభపడగా.. విప్రో, ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 82.62 వద్ద ట్రేడవుతుండగా.. ఔన్సు బంగారం ధర 2345.90 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Exit mobile version