EPFO | రూ.21 వేలకు ఈపీఎఫ్‌వో వేతన పరిమితి.. కొత్త ప్రభుత్వంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్‌..!

  • Publish Date - April 11, 2024 / 03:27 PM IST

EPFO : ‘ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)’ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థలో కథనం ప్రచురితమైంది. అయితే ఎన్నికలు పూర్తయ్యి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ ఆ కథనంలో పేర్కొన్నారు.

కాగా, ఈపీఎఫ్‌వో వేతన పరిమితిని పెంచాలంటూ గత కొన్నాళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చివరిసారిగా 2014లో ఈపీఎఫ్‌వో వేతన పరిమితిని రూ.6,500 నుంచి రూ.15 వేలకు పెంచిన కేంద్రం.. తాజాగా మరోసారి దీనిపై సారించినట్లు ఆ జాతీయ మీడియా సంస్థ తన కథనంలో వెల్లడించింది.

ఈపీఎప్‌వో గరిష్ఠ వేతన పరిమితులను పెంచడం ద్వారా ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేటు రంగంపై కూడా భారం పడుతుంది. అయితే ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుంది. ఇదిలావుంటే ‘ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC)’ ఇప్పటికే ఉద్యోగుల వేతన పరిమితిని రూ.21 వేలకు చేర్చింది. ఈపీఎఫ్‌ను కూడా ఆ మొత్తానికి చేర్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈపీఎఫ్‌వో వేతన పరిమితి పెరిగితే ఉద్యోగి భవిష్యనిధి ఖాతాకు జమయ్యే మొత్తం పెరగనుంది. సాధారణంగా ఉద్యోగి మూలవేతనంలో 12 శాతం ఈపీఎఫ్‌వో ఖాతాలో జమవుతుంది. అంతే మొత్తాన్ని కంపెనీ యజమాని తన వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. యజమాని వాటాలోంచి 8.33 శాతం ఉద్యోగి పెన్షన్‌ పథకానికి, 3.67 శాతం ఉద్యోగి ఈపీఎఫ్‌ ఖాతాకు జమవుతుంది.

ఇలా గరిష్ఠ వేతన పరిమితిని పెంచితే ఆ మేర ఉద్యోగి వేతనంలో నుంచి, యజమాని నుంచి ఈపీఎఫ్‌వో ఖాతాకు చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది. దాంతో ఉద్యోగి ఖాతాలో జమయ్యే మొత్తం అధికమవుతుంది. తద్వారా ఉద్యోగి రిటైర్మెంట్‌ సమయానికి తన ఖాతాలో జమయ్యే భవిష్యనిధి నిల్వలను పెంచుకునే వీలుపడుతుంది.

Latest News