Rana Daggubati : బెట్టింగ్ యాప్ కేసులో సిట్ విచారణకు నటుడు రానా

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా శనివారం సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు. చట్టబద్ధమైన యాప్ అని నిర్ధారించుకున్న తర్వాతే ప్రచారం చేశానని రానా తెలిపారు.

Rana Daggubati

విధాత, హైదరాబాద్ : బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో నటుడు దగ్గుబాటి రానా శనివారం సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు. రాష్ట్రంలో బెట్టింగ్‌యాప్‌ల మోసాలపై దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసిన సెలబ్రిటీలపై కొన్ని నెలల కిత్రం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే కేసులో భాగంగా నటుడు రానా, యాంకర్‌ విష్ణు ప్రియలు ఈ రోజు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలను సిట్‌ అధికారులు విచారణ చేశారు. ఇటీవల విజయ్‌దేవరకొండ, ప్రకాశ్‌రాజ్‌ను సిట్‌ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కేసు విచారణలో భాగంగా సెలబ్రేటీల బ్యాంకు ఖాతా వివరాలతో పాటు, బ్యాంక్ స్టేట్‌మెంట్లను కూడా సిట్ అధికారులకు సమర్పించినట్లు తెలిసింది. ఈ ప్రమోషన్ల కోసం చేసుకున్న ఒప్పందాలు, వాటి ద్వారా పొందిన ఆదాయంపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.

విచారణ అనంతరం నటుడు రానా మీడియాతో మాట్లాడారు. చట్టబద్ధమైన యాప్ అని తెలుసుకున్న తర్వాతే దానికి ప్రచారం చేశానని నటుడు రానా తెలిపారు. ఈ వ్యవహారంపై తన న్యాయ బృందం పూర్తిగా విచారణ చేసిందన్నారు. సంబంధిత వివరాలను సీఐడీ అధికారులకు వివరించానని చెప్పారు.

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో మొత్తం 29 మంది టాలీవుడ్ సినీ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి వంటి వారితో పాటు యూ ట్యూబ్ ఇన్ ఫ్లుయర్స్, టీవీ నటులు, యాంకర్స్ ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా సీఐడీ సిట్ ఈ కేసు దర్యాప్తును చేపట్టింది. రాబోయే రోజుల్లో మరికొంతమంది సెలబ్రిటీలను విచారించనున్నారు.