Actor Govinda | బాలీవుడ్ స్టార్ గోవిందాకు తీవ్ర అస్వ‌స్థ‌త‌

Actor Govinda | హైద‌రాబాద్ : బాలీవుడ్ స్టార్ గోవిందా( Bollywood Star Govinda ) తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. దీంతో ఆయ‌న‌ను మంగ‌ళ‌వారం రాత్రి ముంబై( Mumbai )లోని స‌బ‌ర్బ‌న్ జుహులోని క్రిటికేర్ ఆస్ప‌త్రికి( Criticare Hospital ) త‌ర‌లించారు.

Actor Govinda | హైద‌రాబాద్ : బాలీవుడ్ స్టార్ గోవిందా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. దీంతో ఆయ‌న‌ను మంగ‌ళ‌వారం రాత్రి ముంబైలోని స‌బ‌ర్బ‌న్ జుహులోని క్రిటికేర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు అత‌ని స్నేహితుడు, లీగ‌ల్ అడ్వైజ‌ర్ ల‌లిత్ బిందాల్ తెలిపారు. 61 ఏండ్ల గోవిందా నిన్న రాత్రి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడ‌ని, దాంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌ని పేర్కొన్నారు. ఇక హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లే ముందు ఫోన్ ద్వారా డాక్ట‌ర్ స‌ల‌హాతో మెడిసిన్స్ అందించామ‌న్నారు. బుధ‌వారం తెల్ల‌వారుజామున ఒంటి గంట‌కు ఎమ‌ర్జెన్సీ వార్డులో చేర్చిన‌ట్లు పేర్కొన్నారు. ఇప్ప‌టికే గోవిందాకు అనేక ర‌కాల ప‌రీక్ష‌లు చేశార‌ని, రిపోర్ట్స్ కోసం వేచి చూస్తున్న‌ట్లు బిందాల్ తెలిపారు.

గ‌తేడాది అక్టోబ‌ర్ నెల‌లో గోవిందా కాలికి బుల్లెట్ గాయ‌మైన సంగ‌తి తెలిసిందే. త‌న లైసెన్స్‌డ్ రివాల్వ‌ర్ మిస్ ఫైర్ కావ‌డంతో.. ఆయ‌న కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆ స‌మ‌యంలో కూడా క్రిటికేర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందారు. మోకాలి కింద దూసుకెళ్లిన బుల్లెట్‌ను గంట పాటు శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించి తొల‌గించారు.

తాజాగా గోవిందా భార్య సునీతా అహుజా ఆయనపై ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఆమె తన భర్త ప్రవర్తన, పిల్లలు, వివాహం సంబంధం గురించి చెప్పారు. తన భర్త ఇంత వయసు వచ్చినా తప్పులు చేశారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తన భర్త గోవిందా తన కంటే హీరోయిన్లతో ఎక్కువగా ఉంటారని సునీతా అహుజా తెలిపారు. ‘ఎప్పుడైనా మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవాలి. ఓ వ్యక్తి చిన్నతనంలో తప్పులు చేయడంలో తప్పు లేదు. నేను కూడా వాటిని చేశాను. గోవిందా కూడా చేశారు. కానీ ఓ వయసు వచ్చాక ఎవరు చేసిన తప్పులు కూడా మంచిగా అనిపించవు. అలాగే, మీకు అందమైన ఫ్యామిలీ, అందమైన భార్య, అద్భుతమైన పిల్లలు ఉన్నప్పుడు అలాంటి తప్పులు ఎందుకు చేస్తారు?’ అని సునీతా అహుజా ప్రశ్నించారు.