విధాత : మహేశ్‌బాబు కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSNB29-GlobeTrotter (వర్కింగ్ టైటిల్)కు సంబంధించిన ఈవెంట్ శనివారం రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా అట్టహాసంగా జరుగుతుంది. వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో మహేష్ బాబు అభిమానులు ర్యాలీలుగా తరలివస్తున్నారు. మహేష్ బాబు జెండాలు పట్టుకుని మోటార్ బైక్, కార్ల ర్యాలీలతో రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుంటున్న అభిమానుల సందడితో ఆ ప్రాంతం మారుమ్రోగుతుంది. ఈవెంట్ ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక పాస్ లు జారీ చేసిన చిత్ర బృందం ఈవెంట్‌కు ఎటు వైపు వాళ్లు ఎలా రావాలి? ఎలాంటి సూచనలు పాటించాలి? తదితర వివరాలను పాస్‌లో పొందుపరిచారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈవెంట్ లో విడుదల చేసే మూవీ అప్డేడ్ ఇదే : రాజమౌళి
వారణాసి బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వంచర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పలు దేశాలలో కొంత షూటింగ్ జరుపుకుంది. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నారు.. ఈవెంట్ లో దర్శకుడు రాజమౌళి సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ విడుదల చేస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో టైటిల్‌తో పాటు, సినిమాకు సంబంధించిన ప్రపంచాన్ని పరిచయం చేస్తూ విజువల్స్ కూడా వస్తాయని ఇప్పటికే రాజమౌళి ఎక్స్ వేదికగా తెలిపారు. ఈవెంట్‌లో ఏర్పాటు చేసిన 100 అడుగుల స్క్రీన్‌పై ఆ విజువల్స్ ను ప్రదర్శించిన అనంతరం ఆన్‌లైన్ వేదికగానూ విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో మహేశ్‌బాబు అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి ప్రతినాయకుడు ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రను, మందాకినిగా హీరోయిన్ ప్రియాంక చోప్రా పాత్రలను రాజమౌళి పరిచయం చేశారు. ఇక హీరో మహేశ్‌బాబు లుక్, ఆయన పాత్ర పేరును వెల్లడించాల్సి ఉంది. సినిమాకు సంబంధించి ఊహించని విధంగా ‘సంచారీ’ అంటూ సాగే గీతాన్ని కూడా విడుదల చేసి ఆశ్చర్యపరిచారు. శ్రుతిహాసన్ ఆలపించిన ఈ పాట ఇప్పటికే సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది.
