Mumbai |
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోరేగావ్‌లోని ఓ ఏడు అంతస్తుల భవనంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు.
మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో 28 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఏడు అంతస్తుల భవనంలోని పార్కింగ్‌లో మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పార్కింగ్‌లోని పలు కార్లు, బైక్‌లు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. పార్కింగ్ ఏరియాలో ఉన్న గుడ్డలకు మంటలు అంటుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.