World Largest Python| ప్రపంచంలోనే అతిపెద్ద కొండ చిలువ దొరికేసింది!

ప్రపంచంలోని అతిపెద్ద పొడవైన భారీ కొండ చిలువ(పైథాన్) పామును ఇండోనేషియాలోని సులవేసి ప్రాంతంలో గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డు పోస్టు చేయగా .. అది వైరల్ అవుతోంది.

విధాత : అనకొండ సినిమాలో చూసిన భారీ కొండ చిలువలు, అనకొండలను చూసి ప్రపంచం అశ్చర్యానికి లోనైంది. ఒకప్పుడు భూమిపై ఇంత భారీ పాములు ఉన్నాయా అంటూ భయభ్రాంతులకు గురయ్యారు. అమెజాన్ నది ప్రాంత అడవులు భారీ అనకొండలకు నెలవుగా భావిస్తుంటారు. అయితే భారీ అనకొండలు, కొండ చిలువలకు ఇండోనేషియా ప్రాంతం కూడా అవాసంగా కొనసాగుతుంటుంది. ఆ దేశంలో రకరకాల భారీ కొండ చిలువలు మనుగడ సాగిస్తుంటాయి. మనుషులను సైతం మింగిన సంఘటనలు తాజాగా వెలుగు చూశాయి. అయితే ప్రపంచంలోని అతిపెద్ద పొడవైన పైథాన్ పామును ఇండోనేషియాలోని సులవేసి ప్రాంతంలో గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

“ఇబు బారన్” అని పిలిచే ఈ ఆడ మలయ్ కొండచిలువ 7.22 మీటర్ల (23 అడుగుల 8 అంగుళాలు) పొడవుతో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. జనవరి 18న దీని పొడవును అధికారికంగా కొలిచినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తాజాగా చేసిన ట్వీట్ వైరలవుతోంది.ఈ పొడవైన అడవి పాము(పైథాన్) బరువు మొత్తం 97కిలోలు ఉంది. పొడవైన ఈ భారీ సర్పాన్ని చూసిన నెటిజన్లు అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇదే సులవేసి ప్రాంతంలోనే 1912లో 10 మీటర్ల (32 అడుగుల 10 అంగుళాలు) పొడవుతో ఉన్న భారీ పైథాన్ ను కాల్చి చంపడం గమనార్హం.

పెంపుడు పైథాన్ లో “మెడుసా” దే రికార్డు

పెంపుడు పైథాన్ లలో అమెరికాలోని మిస్సోరి కాన్సాస్ నగరంలోని ఎడ్జ్ ఆఫ్ హెల్ హాంటెడ్ హౌస్ లోని “మెడుసా” పాముదే ప్రపంచ రికార్డుగా ఉంది. ఈ రెటిక్యులేటెడ్ ఆడ పైథాన్ (మలయోపైథాన్ రెటిక్యులటస్) 7.67 మీటర్ల (25.2 అడుగులు) పొడవు, 158.8 కిలోలు (350 పౌండ్లు )బరువుతో జీవించింది. చివరిగా దీని పొడవును 2011లో కొలిచారు. అప్పటికే 10 ఏళ్ల వయసుతో ఉన్న ఆ భారీ పాము యొక్క రికార్డు పొడవును కొలవడానికి, దానిని పూర్తి పొడవుతో పట్టుకోవడానికి 15 మంది వ్యక్తులు అవసరమయ్యారట. దానికి ఆహారంగా రెండు వారాలకు ఒకసారి కుందేళ్లు, పందులు, జింకల మాంసం అందించేవారు. అది ఒకేసారి 18 కిలోల (40 పౌండ్ల) జింకను పూర్తిగా తినగలడం విశేషం. రెటిక్యులేటెడ్ పైథాన్‌లు ప్రధానంగా ఆగ్నేయాసియా, ఇండోనేషియా , ఫిలిప్పీన్స్‌లలో నివసిస్తాయి. ఈ భారీ పైతాన్ జాతులు నీటిలో బాగా ఈదుతాయని ప్రసిద్ది.

కొండచిలువ జాతికి చెందిన ఏ పాము కూడా విషపూరితమైనది కావు. అతిపెద్ద విషపూరిత పాములు భారతదేశం, ఆగ్నేయాసియాకు చెందిన కింగ్ కోబ్రాలు (ఓఫియోఫాగస్ హన్నా). ఇవి 4 మీటర్లు (13 అడుగుల) పొడవు వరకు పెరుగుతాయి.

టైటానోబోవా రికార్డును బద్దలు కొట్టిన వాసుకీ

ఇప్పటివరకు భూమిపై మనుగడ సాగించిన అత్యంత పొడవైన పాము జాతులలో టైటానోబోవా సెర్రెజోనెన్సిస్ ఒకటిగా చరిత్రకారుడు చెబుతారు. ఇది 58–60 మిలియన్ సంవత్సరాల నాటి బోవా రకం పాము. దీని శిలాజాలు కొలంబియాలోని లా గ్వాజిరాలో కనుగొనబడిన 28 నమూనాల నుండి గుర్తించారు. దీని శరీరంలోని అత్యంత మందపాటి భాగంలో సుమారు 1 మీటర్ (3 అడుగుల 2 అంగుళాలు) వెడల్పు, సుమారు 1,135 కిలోగ్రాముల (2,500 పౌండ్లు) బరువు ఉండేదని నిపుణులు నిర్ధారించారు.

అయితే ఇటీవల టైటానోబోవాకు పోటీగా మరో అతిపెద్ద పాము వెలుగులోకి వచ్చింది. భారత పురాణగాధల్లో వినిపించే వాసుకీ పామును తలపించే రీతీతో ఉన్న భారీ పాము వాసుకి ఇండికస్ గురించి ఏప్రిల్ 2024లో వివరాలు ప్రచురించబడ్డాయి. ఇది మాడ్సోయిడ్ పాము యొక్క శిలాజ జాతి. దీని 27 వెన్నుపూసలు 2005లో భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి. ఈ జాతి 10.9–15.2 మీటర్ల (35 అడుగుల 9 అంగుళాలు–49 అడుగుల 10 అంగుళాలు) పొడవు ఉండేదని అంచనా. ఇది 47 మిలియన్ సంవత్సరాల క్రితం మధ్య ఇయోసిన్ యుగంలో మనుగడ సాగించదని పరిశోధకులు నివేదించారు.

Latest News