ERC | రాష్ట్రంలో క‌రెంట్ క‌నెక్ష‌న్ చాలా సులువు.. ప‌దేళ్ల త‌ర్వాత మ‌రో కీల‌క స‌వ‌ర‌ణ‌

ERC | ఇక నుంచి రాష్ట్రంలో కొత్త‌గా నిర్మించుకునే ఇళ్లు, అపార్ట్‌మెంట్ల‌కు క‌రెంట్ క‌నెక్ష‌న్‌ను చాలా సులువు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు విద్యుత్ రంగంలో ప‌దేళ్ల త‌ర్వాత మ‌రో కీల‌క స‌వ‌ర‌ణ జ‌రిగింది.

  • By: raj |    telangana |    Published on : Feb 05, 2026 2:50 PM IST
ERC | రాష్ట్రంలో క‌రెంట్ క‌నెక్ష‌న్ చాలా సులువు.. ప‌దేళ్ల త‌ర్వాత మ‌రో కీల‌క స‌వ‌ర‌ణ‌

ERC | ఇక నుంచి రాష్ట్రంలో కొత్త‌గా నిర్మించుకునే ఇళ్లు, అపార్ట్‌మెంట్ల‌కు క‌రెంట్ క‌నెక్ష‌న్‌ను చాలా సులువు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు విద్యుత్ రంగంలో ప‌దేళ్ల త‌ర్వాత మ‌రో కీల‌క స‌వ‌ర‌ణ జ‌రిగింది.

కొత్త‌గా ఇళ్లుకు లేదా అపార్ట్‌మెంట్‌కు కరెంట్ క‌నెక్ష‌న్ కావాల‌ని అడ‌గ్గానే విద్యుత్ శాఖ అధికారులు లంచాలు అడిగే వారు. అంటే త‌మ‌కు అనుకూల‌మైన కాంట్రాక్ట‌ర్‌ను రంగంలోకి దింపి.. ఎస్టిమేట్ వ్య‌యం పేరుతో సొమ్ము చెల్లించాల‌ని కొంద‌రు విద్యుత్ సిబ్బంది దందాలు కొన‌సాగించేవారు. ఈ దందాలు అధిక‌మైన నేప‌థ్యంలో ప్ర‌జ‌లు కూడా విసిగిపోయి.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్ర‌మంలో క‌రెంట్ క‌నెక్ష‌న్ కోసం అధికారులు కొన‌సాగిస్తున్న దందాల‌కు అడ్డుక‌ట్ట వేస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్ర‌ణ మండ‌లి కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఎస్టిమేట్ త‌యారీ నిబంధ‌న‌లు పూర్తిగా ర‌ద్దు చేసింది. ఈఆర్‌సీ ఆదేశాల మేర‌కు గురువారం నుంచి కొత్త నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌చ్చాయి. కొత్త క‌నెక్ష‌న్లు, అద‌న‌పు లోడ్ జారీకి మార్పులు చేస్తూ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేశాయి.

మార్గ‌ద‌ర్శ‌కాల్లోని కొన్ని ముఖ్యాంశాలు..

నిన్న‌టి వ‌ర‌కు ఏదైనా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ లేదా క‌మ‌ర్షియ‌ల్ బిల్డింగ్‌లో కొంత‌భాగం కొన్న‌వారి నుంచి డెవ‌ల‌ప్‌మెంట్ ఛార్జీతో తోచినంత క‌రెంట్ క‌నెక్ష‌న్‌కు, కొత్త ట్రాన్స్‌ఫార్మ‌ర్ ఏర్పాటు వ్య‌యం పేరుతో వ‌సూలు చేసేవారు. ఇక‌పై అలా ఛార్జీలు వ‌సూలు చేయ‌డానికి వీల్లేదు.

అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భ‌వ‌నాల‌కు ప్ర‌త్యేక ట్రాన్స్‌ఫార్మ‌ర్ వ్య‌యాన్ని ఇక విడిగా డిస్కంలు వ‌సూలు చేయ‌డానికి కూడా వీల్లేదు. ఆ భ‌వ‌నంలో మొత్తం ఫ్లాట్లు, లిఫ్ట్, వాటర్‌ కనెక్షన్‌ వంటి కామన్‌ వినియోగానికి కలిపి ఎన్ని కరెంటు కనెక్షన్లు ఇస్తున్నారు.. వాటి మొత్తం లోడు ఎంత అనేది లెక్కించాలి. ఈ లెక్క ప్రకారం ప్రతి కిలోవాట్‌కు రూ.10 వేల చొప్పున డిస్కంకు కట్టాలి. అదనంగా మరో రూ.200 చొప్పున ‘సెక్యూరిటీ డిపాజిట్‌’ కట్టాలి. వాణిజ్య భవనాలకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ఈ రుసుములు కట్టిన అపార్టుమెంట్లకు ట్రాన్స్‌ఫార్మర్‌ను డిస్కం నేరుగా ఏర్పాటుచేయాలి. దానికి అదనంగా ఏమీ వసూలు చేయరాదు. ఒకవేళ వినియోగదారుడి ఖర్చుతో ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటుచేస్తే దాన్ని డిస్కం నిర్వహించాలి. దాన్నుంచి ఇతర వినియోగదారులకు కనెక్షన్లు ఇవ్వకూడదు.

కొత్తగా ప్లాట్లువేసే రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకయ్యే వ్యయాన్ని వారే భరించాలి. పొలంలో కొత్తగా బోరు వేయించిన రైతు కరెంటు కనెక్షన్‌కు దరఖాస్తు చేస్తే కిలోవాట్‌కు రూ.వెయ్యి చొప్పున మాత్రమే డిస్కం వసూలు చేయాలి.

విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసుకుంటే 20 కిలోవాట్లలోపు అయితే రూ.3,400, అంతకుమించితే రూ.8 వేల చొప్పున రుసుం కట్టాలి.

20 కిలోవాట్ల వరకు సర్వీస్‌ లైన్‌ ఛార్జీలతోపాటు డెవలప్‌మెంట్‌ ఛార్జీలను డిస్కంలు వసూలు చేస్తాయి. 20 కిలోవాట్లు దాటితే కేవలం సర్వీస్‌ లైన్‌ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తాయి. ఇప్పటికే అమల్లో ఉన్న డెవలప్‌మెంట్‌ ఛార్జీలు.. కిలోవాట్‌కు గృహావసరాలకు రూ.1,646, వాణిజ్య అవసరాలకు రూ.2,275.
గృహ విభాగంలో ఇంటి విస్తీర్ణం ఆధారంగా కనీస లోడ్‌ను నిర్ణయించారు. 500 చదరపు అడుగుల విస్తీర్ణంలోపు ఉన్న ఇంటికి/ఫ్లాట్‌కు కనీసం 2 కిలోవాట్లు తీసుకోవాల్సి ఉంటుంది.

ఉదాహరణకు ఒక అపార్టుమెంటులో మొత్తం 30 ఫ్లాట్లు ఉన్నాయనుకుందాం. ఒక్కో ఫ్లాటుకు కనీసం 3 కిలోవాట్ల లోడుతో బిల్డర్‌ ఆరంభంలో కనెక్షన్‌ తీసుకుంటున్నారు. మొత్తం 30 ఫ్లాట్లకు కలిపి 90 కిలోవాట్లు అవుతుంది. ఇదికాకుండా లిఫ్ట్, వాటర్‌ కనెక్షన్‌ వంటి కామన్‌ వినియోగానికి సంబంధించి విడిగా తీసుకున్న కనెక్షన్‌ లోడు మరో 10 కిలోవాట్లు ఉందనుకుంటే దీంతో కలిపి మొత్తం అపార్టుమెంటు భవనం కనెక్షన్ల లోడు 100 కిలోవాట్లకు చేరుతుంది. దీనికి రూ.10,200 చొప్పున రూ.10.20 లక్షలు మాత్రమే డిస్కంకు బిల్డర్‌ చెల్లిస్తారు.

ఒక ఫ్లాట్‌ కొనేవారు ముందుగా దానికి ఉన్న కరెంటు కనెక్షన్‌ లోడు ఎంత అనేది చెక్‌ చేసుకోవాలి. దానికి ఉదాహరణకు 3 కిలోవాట్ల లోడుతో కనెక్షన్‌ బిల్డర్‌ ముందే తీసుకుని ఉంటే రూ.30,600 మాత్రమే అతనికి ఇవ్వాలి. అదనంగా కామన్‌ కనెక్షన్‌ లోడు 10 కిలోవాట్ల కనెక్షన్‌కు బిల్డర్‌ డిస్కంకు చెల్లించిన రూ.1,02,000ను మొత్తం 30 ఫ్లాట్లకు సమానంగా పంచితే ఒక ఫ్లాట్‌కు రూ.3,400 అవుతుంది. ఇది మాత్రమే బిల్డర్‌కు అదనంగా చెల్లించాలి. అంటే ఆ ఫ్లాట్‌కు మొత్తం రూ.34 వేలు మాత్రమే బిల్డర్‌కు ఇవ్వాలి.
ఒకవేళ అపార్టుమెంటు లేదా వాణిజ్య భవనంలోని అన్ని కనెక్షన్ల లోడు 20 కిలోవాట్లలోపు ఉంటే రూ.4,600 చొప్పున ఒక్కో కిలోవాట్‌కు కట్టాలి.

ఎక్కువగా రైతులు బోరుకు 5 అశ్వికశక్తి (హెచ్‌పీ) కరెంటు మోటారు పెడతారు. దీనికి సాధారణంగా 3.8 కిలోవాట్ల లోడు కరెంటు కనెక్షన్‌ తీసుకుంటారు. దీనికి రూ.3,800 చెల్లిస్తే సరిపోతుంది. ఇదికాకుండా కిలోవాట్‌కు మరో రూ.1,200 డెవలప్‌మెంట్‌ రుసుం తీసుకుంటారు. ఇవికాకుండా ‘అవుట్‌ రైట్‌ కంట్రిబ్యూషన్‌ (ఓఆర్‌సీ)’ పేరుతో అదనంగా ఇంతకాలం వసూలు చేస్తున్న రుసుములన్నీ ఇక నిలిపివేయాలని ఈఆర్‌సీ స్పష్టం చేసింది.