అమెరికాకు చెందిన నాథన్ థామస్ అద్భుతం చేసి చూపించాడు. ఫ్లోరిడా యువకుడు నాథన్ థామస్ మియామీ డేడ్ కాలేజీలో ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా బాధ్యతలు చేపట్టి.. అతిపిన్న ప్రొఫెసర్‌గా గిన్నిస్ రికార్డులకెక్కాడు. 18ఏళ్ల 346రోజుల వయసులో ప్రొఫెసర్ గా మారి..306 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టి.. అతి పిన్న వయస్కుడైన పురుష ప్రొఫెసర్‌గా సరికొత్త రికార్డు సాధించాడు.
19 ఏళ్ల వయసులో ప్రొఫెసర్ అయిన కోలిన్ మాక్లారిన్ 306 సంవత్సరాల పాటు ఈ రికార్డును కలిగి ఉన్నారు. 2008లో 18 సంవత్సరాల 362 రోజుల వయస్సులో ప్రొఫెసర్‌గా మారిన మహిళా ప్రొఫెసర్ ఆలియా సబూర్ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ప్రొఫెసర్ గా ప్రస్తుతం రికార్డు కలిగి ఉంది. ఆమె కంటే కూడా థామస్ 16 రోజులు చిన్నవాడు కావడం గమనార్హం.
ప్రొఫెసర్ గా థామస్ తన తరగతిలో తన వయసున్న విద్యార్ధులకు క్లిష్టమైన కంప్యూటరింగ్, ప్రోగ్రామింగ్ భావనలను బోధిస్తున్నాడు. థామస్ కేవలం 10 సంవత్సరాల వయస్సులో మియామీ డేడ్ కాలేజీలో డ్యూయల్-ఎన్‌రోల్ అయ్యాడు. ఆ తర్వాత 14 సంవత్సరాల వయస్సులో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీకి మారాడు. తదుపరి నాలుగు సంవత్సరాలలో, అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో తన బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీలు రెండింటినీ ఆనర్స్‌తో పూర్తి చేశాడు.
ఇంజనీర్ల కుటుంబం నుండి వచ్చిన థామస్.. తాను పెరిగేకొద్దీ గణితం తనకు సహజంగానే అబ్బిందని చెప్పాడు. కష్టమైన విషయాలను కూడా తన తల్లి తేలికగా అనిపించేలా చేసేదని, ఆ గుణం తాను అప్పట్లో గ్రహించిన దానికంటే ఎక్కువగా తనలో నిలిచిపోయిందని అతను వివరించాడు. బోధన గురించి మాట్లాడుతూ.. కొద్ది క్షణాల ముందు అసాధ్యంగా అనిపించిన ఒక భావన, అకస్మాత్తుగా విద్యార్థికి అర్థం కావడాన్ని చూడటమే తాను ఎక్కువగా ప్రొఫెసర్ గా ఆస్వాదించే అంశం అని థామస్ చెప్పాడు.
విద్యార్ధులు తరగతి గదిలోకి నేర్చుకోవడం కోసమే వస్తారని, అందులో వయసు అనేది నిజంగా ఒక అంశం కాదు అని థామస్ స్పష్టం చేశారు. తాను కేవలం తన పనిని చక్కగా చేయడంపైనా, తనకు చేతనైన రీతిలో విద్యార్థులకు సహాయం చేయడంపైనే దృష్టి పెడతానని అన్నారు.