Site icon vidhaatha

Dharmasthala | ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం

Dharmasthala |  కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో 1998 నుంచి 2014 మధ్యకాలంలో మహిళలకు, బాలికలకు సంబంధించిన అనేక శవాలను పూడ్చి పెట్టానని ఒక దళితుడు, ధర్మస్థల ఆలయ మాజీ పారిశుధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు దేశంలో సంచలనం రేపింది. ఆలయంలోని కొందరి ఒత్తిడితో తానీ పని చేసినట్టు పోలీసులకు అందించిన ఫిర్యాదులో అతడు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులు.. ఇప్పుడు నేత్రావతి నది సమీపంలో ఆ శవాలను వెలికి తీసే ఆలోచనలో ఉన్నారు. బీఎన్‌ఎస్‌లోని సెక్షన్‌ 211 (ఏ) ప్రకారం ధర్మస్థల పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసినట్టు జిల్లా ఎస్పీ కే అరుణ్‌ చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించామని, మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. శవాలను వెలికితీసేందుకు తీసుకోవాల్సిన చర్యలు ప్రారంభించామని చెప్పారు. అయితే.. వెలికితీత ఎప్పుడు ఉంటుందనేది చెప్పలేనని హెచ్‌టీకి చెప్పారు.

సదరు కార్మికుడి తరఫున బెంగళూరుకు చెందిన న్యాయవాదులు ఒజాస్వి గౌడ, సచిన్‌ దేశ్‌పాండే జూలై 3వ తేదీన ధర్మస్థల పోలీసులకు అందించారు. అందులో సాక్షుల రక్షణ చట్టం కింద తనకు తక్షణమే రక్షణ కల్పించాలని ఫిర్యాదుదారుడు కోరాడు. ఆ మరుసటి రోజు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. తాము ఫిర్యాదు అందించిన నాటి నుంచి పోలీసుల పనితీరు సంతృప్తికరంగానే ఉన్నదని న్యాయవాదులు తెలిపారు. ‘ఆ వ్యక్తి (ఫిర్యాదుదారుడు) ముప్పు ఎదుర్కొంటున్నాడు. అందుకే అతడి గుర్తింపును బయటపెట్టడం లేదు’ అని న్యాయవాది గౌడ తెలిపారు. ఫిర్యాదుతోపాటు ఒక ఖనన ప్రదేశానికి సంబంధించిన ఫొటో కూడా సమర్పించారు. ఈ కేసులో దర్యాప్తును కొనసాగించేందుకు పోలీసులు కోర్టు అనుమతిని తీసుకున్నారు. దర్యాప్తు తదుపరి దశలో శవాల వెలికితీత ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో ఫిర్యాదుదారుడు కోరిన విధంగా అతడికి రక్షణ కల్పంచే అంశాన్ని సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. సాక్షుల రక్షణ పథకం ప్రకారం.. ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్ అండ్‌ సెషన్స్‌ జడ్జి, సంబంధిత ప్రాంత పోలీసు అధికారి, ప్రాసిక్యూషన్‌ హెడ్‌తో కూడిన జిల్లా స్థాయి ఉన్నత కమిటీ పరిస్థితిని పరిశీలించి, అతడికి ఉన్న ప్రమాదాన్ని అంచనా వేసిన రక్షణ కల్పించే విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. పోలీసుల రక్షణ, ఇన్‌కెమెరా కోర్టు ప్రొసీడింగ్స్‌, సాక్షిని వేరొక ప్రాంతానికి తరలించడం లేదా అతడి గుర్తింపును మార్చివేడం వంటి చర్యలపై కమిటీ ఆమోదం తెలియజేస్తుంది.

ధర్మస్థలలో శవాలు పాతిపెట్టానన్న వ్యక్తి ఫిర్యాదులో ఏమున్నదో ఈ కింది కథనంలో చదవొచ్చు

Dharmasthala | ధర్మస్థలలో దారుణాలు? ఇరవై ఏళ్లపాటు రేప్‌ విక్టిమ్‌ల శవాలు పాతిపెట్టానన్న పారిశుధ్య కార్మికుడు

Exit mobile version