Site icon vidhaatha

ముంబైలో రోజూ 3 పోక్సో కేసులు.. 90 శాతం నిందితులు బంధువులు/ పరిచయస్తులు



విధాత‌: దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో ప్ర‌తి రోజూ సగ‌టున మూడు పోక్సో (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ) కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు నగరంలో 835 కేసులు నమోదయ్యాయి. వీటిలో 441 ​​మైనర్ రేప్ కేసులు ఉన్నాయి. 99 శాతం కేసుల్లో పోలీసులు నిందితులు గుర్తించారు. మంచి, చెడు ట‌చ్‌ల‌ను పిల్ల‌లు తెలుసుకోలేక‌పోతున్నార‌ని నిపుణులు పేర్కొన్నారు.


గ‌త ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మైనర్లపై నేరాలు కాస్త తగ్గాయి. గతేడాది సెప్టెంబర్ 30 వరకు 453 మైనర్ రేప్ కేసులు న‌మోద‌య్యాయి. వాటిల్లో 94 శాతం కేసుల్లో నిందితుల‌ను గుర్తించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద నమోదైన కేసులతో కలిపి ఈ ఏడాది 360 పిల్లలపై వేధింపుల కేసులు రికార్డ‌య్యాయి. గతేడాది ఇదే కాలంలో 357 వేధింపుల కేసులు నమోదయ్యాయి. నిరుడుతో పోలిస్తే మూడు కేసులు మాత్ర‌మే త‌గ్గాయి. ఈ సంవత్సరం అదనంగా ఈవ్-టీజింగ్ కేసులు 14 నమోదయ్యాయి. నిరుడు 32 ఈవ్-టీజింగ్ కేసులు, 20 ఇతర కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ పోక్సో చట్టం కిందకు వస్తాయి.


మైనర్లతో బలవంతంగా వ్యభిచారం కేసులు లేవు


మైనర్లతో బలవంతంగా వ్యభిచారం చేయించడంపై ఈ ఏడాది ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గత ఏడాది మాత్రం అలాంటి కేసు ఒకటి నమోదైంది. 90 శాతం పోక్సో కేసుల్లో నిందితులు కుటుంబ సభ్యులు, బంధువులు లేదా పరిచయస్తులే కావడం ఆందోళనకరం. ముంబైలోని మ‌లాడ్‌, డియోనార్ ప్రాంతాల్లో కరాటే, క్రికెట్ కోచ్‌లు పిల్లలను దుర్భాషలాడిన ఘ‌ట‌న‌ల్లో కూడా కేసులు న‌మోద‌య్యాయి. ఆంటోప్ హిల్‌లో ఒక మైనర్ బాలికను అవమానపరిచే వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.


న‌మోదైన కేసులు కొన్ని మాత్ర‌మే


ముంబైలో న‌మోదైన పోక్సో కేసుల సంఖ్య మంచుకొండలో కొస‌ మాత్రమేన‌ని చైల్డ్ యాక్టివిస్ట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షురాలు నందితా అంబికే పేర్కొన్నారు. భ‌య‌ట‌కు రాని, న‌మోదు కానీ ఘ‌ట‌న‌లుఇంకా అధిక సంఖ్య‌లో ఉంటాయ‌ని తెలిపారు. చాలా మంది పిల్లలు భయం కారణంగా త‌న భ‌యంక‌ర‌ అనుభవాలను వ్యక్తపరచలేర‌ని వెల్ల‌డించారు. బంధువులు కొంద‌రు పిల్ల‌ల‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డినా తల్లిదండ్రులు తరచుగా వాటిని నమ్మర‌ని తెలిపారు. పిల్ల‌ల‌పై బంధువులు, ప‌రిచ‌య‌స్తులు చేసే వేధింపుల‌ను కుటుంబం, స‌మాజం చాలా వ‌ర‌కు బ‌య‌ట‌కు చెప్ప‌ద‌ని వివ‌రించారు.

Exit mobile version