పోలింగ్‌ వ‌ర‌కు ఫోన్ ట్యాపింగ్ తేల‌దా

పార్ల‌మెంటు ఎన్నిక‌లు పూర్త‌యితే కాని ఫోన్ ట్యాపింగ్ పై ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశాలు లేవు. ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద‌ల గుట్టు ర‌ట్టు కావాలంటే మాజీ ఎస్ఐబి చీఫ్ టి.ప్ర‌భాక‌ర్ రావు

  • Publish Date - April 13, 2024 / 11:01 PM IST

విధాత‌, హైద‌రాబాద్‌: పార్ల‌మెంటు ఎన్నిక‌లు పూర్త‌యితే కాని ఫోన్ ట్యాపింగ్ పై ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశాలు లేవు. ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద‌ల గుట్టు ర‌ట్టు కావాలంటే మాజీ ఎస్ఐబి చీఫ్ టి.ప్ర‌భాక‌ర్ రావు హైద‌రాబాద్ వ‌స్తే కాని వెల్ల‌డి కాదు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే మాజీ ఎస్ఐబి చీఫ్ టి.ప్ర‌భాక‌ర్ రావు క్యాన్స‌ర్ వ్యాధి చికిత్స అంటూ అమెరికా వెళ్ల‌డం జ‌రిగింది. ఆరు నెల‌ల వీసా తీసుకుని ప్ర‌భాక‌ర్ రావు అమెరికా వెళ్లారు. వీసా గ‌డువు ముగిసిన త‌రువాత ఆయ‌న హైద‌రాబాద్ కు రాని ప‌క్షంలో అప్పుడు తెలంగాణ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయ‌డానికి అధికారం ఉంటుంది. వీసా గ‌డువు ముగిసే వ‌ర‌కు ఆయ‌న‌ను ర‌ప్పించడం క‌ష్ట‌మ‌ని, ఆ త‌రువాతే ఏమైనా చ‌ర్య‌లు తీసుకునే అధికారం ఉంటుంద‌ని, అప్ప‌టి వ‌ర‌కు వెయిట్ చేయ‌డ‌మేన‌ని పోలీసు వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. ఇదిలా ఉండ‌గా కేసు తీవ్ర‌త దృష్ట్యా ఆయ‌న తిరిగి హైద‌రాబాద్ కు వ‌స్తున్నార‌ని, మార్గ మ‌ధ్యన‌ దుబాయ్ లో ఆయ‌న ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. అస‌లు ఆయ‌న ఇంత‌కు దుబాయ్ వ‌చ్చారా లేదా ప్ర‌చారం చేస్తున్నారా అనేది స్ప‌ష్ట‌త రావాల్సిన అవ‌స‌రం ఉంది. ఒక పార్టీకి చెందిన‌ పెద్ద‌ల సూచ‌న‌తోనే ఆయ‌న హైద‌రాబాద్ రావ‌డం లేద‌ని, ఆయ‌న వ‌స్తే బండారం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని, ఊహించ‌ని అరెస్టులు జ‌రిగే ఛాన్స్ ఉండ‌డంతో వెనక్కి పంపించార‌నే టాక్ కూడా న‌డుస్తున్న‌ది.
పార్ల‌మెంటు ఎన్నిక‌లు ఉండ‌డంతో ఫోన్ ట్యాపింగ్ పై అటు కాంగ్రెస్ ఇటు బిఆరెస్ లు పోటాపోటీగా విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ నిజం, వాస్త‌వాలు త్వ‌ర‌లో వెల్ల‌డి అవుతాయ‌ని పోలీసు అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ నాయ‌కులు గ‌త ప‌ది రోజులుగా బిఆరెస్ పై ముప్పెట దాడి చేస్తూ, ఊపిరి స‌ల‌ప‌నీయ‌కుండా చేస్తున్నారు. ప్ర‌భాక‌ర్ రావు వ‌స్తే త‌ప్పితే ఇప్ప‌ట్లో కేసు కు ముగింపు పలికే అవ‌కాశాలు లేవ‌ని ప‌రిస్థితులను ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతుంది. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త ప్ర‌భుత్వ పెద్ద‌ల ఆదేశాల ప్ర‌కారం ప‌నిచేసిన‌ పోలీసు అధికారుల‌ను అరెస్టు చేసి విచారిస్తున్న విష‌యం తెలిసిందే. సిట్ విచార‌ణ‌లో వెలుగులోకి వ‌చ్చిన వివ‌రాల ప్ర‌కారం ఒక బిఆరెస్‌ ఎమ్మెల్సీ, ఒక మాజీ మంత్రి, ఇద్ద‌రు ఎమ్మెల్యేలను విచారించేందుకు సిట్ నోటీసులు సిద్ధం చేస్తున్న‌ద‌ని వార్త‌లొస్తున్నాయి. మొత్తానికి ఈ కేసులో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ది. ఈ కేసులో ఉన్న‌వారంద‌రినీ చ‌ట్ట‌ప‌రంగా శిక్షించాల‌నే ఉద్ధేశ్యంతో బ‌ల‌మైన ఆధారాలు సేక‌రించాల‌ని సిట్ ను ఆదేశించింది.

Latest News