Site icon vidhaatha

ప్రాణాలు తీసిన వాషింగ్ మెషిన్..విద్యుదాఘాతంతో వివాహిత మృతి

విధాత ,సిద్దవటం: వాషింగ్‌ యంత్రంలో దుస్తులు వేస్తుండగా విద్యుత్తు ప్రసారం కావడంతో తంగా సరస్వతి (30) మృత్యువాత పడిన సంఘటన సిద్దవటం మండలంలోని ఏపీఎస్పీ పదకొండో బెటాలియన్‌కు సమీపంలో ఉన్న కొత్తకొట్టాల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొత్తకొట్టాల గ్రామానికి చెందిన తంగా వెంకటసుబ్బయ్య, సరస్వతి దంపతులకు ఇద్దరు కుమారులు, పది నెలల కుమార్తె ఉన్నారు.

వెంకటసుబ్బయ్య వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవారు.బుధవారం సరస్వతి వాషింగ్‌ యంత్రంలో దస్తులు వేస్తూ విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు.వారు వచ్చి పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు,బంధువుల రోదనలు మిన్నంటాయి. సరస్వతి సోదరుడు పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసూదనరెడ్డి తెలిపారు.

Exit mobile version