SCAM | అధిక వడ్డీ ఆశ చూపి డిపాజిట్ల పేరిట రూ.100 కోట్లు సేకరించిన ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. 12శాతం వడ్డీ ఇస్తామని చెప్పిన ఆ సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులే టార్గెట్ గా విరాళాలు సేకరించారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో మ్యాక్స్ అనే సంస్థ ఉద్యోగులను నమ్మించి అనంతరం బోర్డు తిప్పేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మ్యాక్స్ సంస్థ డైరెక్టర్లు, ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి ఉండడం గమనార్హం. ప్రస్తుతం పరారీలో ఉన్న రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి శివభాగ్యారావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంబేద్కర్ ఆశయ సాధన పేరుతో శివభాగ్యారావు 2008లో మ్యాక్స్ కోఆపరేటివ్ సొసైటీని స్థాపించాడు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగులు, పెన్షనర్లను టార్గెట్ చేశారు. డిపాజిట్ చేస్తే 12శాతం వడ్డి ఇస్తానని ఆశచూపాడు. దీంతో నమ్మిన 2500 మంది వంద కోట్ల రూపాయల వరకు డిపాజిట్ చేశారు.
ప్రారంభంలో సరిగ్గానే వడ్డీ చెల్లించిన మ్యాక్స్ సంస్థ.. ఆ తర్వాత కార్యకలాపాలను తగ్గించడం మొదలు పెట్టింది. దీంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుతో సంస్థ డైరెక్టర్లు, ఉద్యోగులను తాజాగా పోలీసులు అరెస్ట్ చేయడంతో.. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మ్యాక్స్ సంస్థ ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు, డైరెక్లర్లు ఉండవల్లి శ్రీనివాసరావు, గూడూరు సీతామహాలక్షి, ఎల్.విశ్వేశ్వరావు, అకౌంటెంట్ ధనలక్ష్మీ, మేనేజర్ రంగారావు అరెస్టయినవారిలో ఉన్నారు. చైర్మన్ శివభాగ్యారావుతో పాటు మరో 12 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.