Site icon vidhaatha

మాయలేడీ అరెస్ట్

సూర్యారావుపేటలో నిందితురాలు రమాదేవిని అదుపులోకి తీసుకున్న పెనమలూరు పోలీసులు

విధాత,అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాలు.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పెళ్లి సంబంధాల పేరిట పలువురిని మోసగించి రూ.80 లక్షలకు పైగా సొమ్మును కాజేసి మూడు నెలలుగా పరారీలో ఉన్న మాయలేడి కొప్పుల రమాదేవిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. మాయలేడి మాయలపై కొన్ని పత్రికాలో ప్రచురితమైన నేపథ్యంలో పోలీసు కమిషనర్‌ ఆమె ఆచూకీని కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఇప్పటికే హైదరాబాద్‌లో రమాదేవి తలదాచుకున్నారన్న సమాచారం మేరకు ఆమె కదలికలపై పెనమలూరు పోలీసులు నిఘా పెట్టారు.

మంగళవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి నగరానికి చేరుకున్న నిందితురాలు బుధవారం ఉదయం కోర్టులో లొంగిపోవాలని నిర్ణయించుకుని, ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంది. అయితే సూర్యారావుపేటలోని ఓ ప్రాంతంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తల్లి, కుమారుడు, కుమార్తె కలిసి

గతంలో తనతో కలిసి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసిన కానూరుకు చెందిన ఒక మహిళ కుమారుడు, కుమార్తెకు హైకోర్టు, నీటిపారుదల శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.19.90 లక్షలు కాజేసింది.

ఈ ఘటనలో రమాదేవికి ఆమె కుమారుడు నాని, కుమార్తె దివ్యశ్రీలు సహకారం అందించారు. అనంతరం ముగ్గురు కలిసి నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ కాపీని ఇచ్చారు. తర్వాత విచారణలో ఆ ఆర్డరు కాపీలు నకిలీవని తేలడంతో బాధితురాలు తాను మోసపోయినట్లు గ్రహించి ఈ ఏడాది ఫిబ్రవరి 2న పెనమలూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు పోలీసులు రమాదేవితోపాటు ఆమె కుమార్తె దివ్యశ్రీ, కుమారుడు నానిలపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వారు పరారీలో ఉన్నారు.బుధవారం నాటకీయంగా పోలీసులు అరెస్టు చేసినా ఆమె కుమారుడు, కుమార్తె పరారీలోనే ఉన్నారు. నిందితురాలిని గురువారం కోర్టులో హాజరుపరచనున్నట్లు పెనమలూరు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు.

Exit mobile version