Site icon vidhaatha

ఇంటి నిర్మాణంలో ఆ దిశ‌కు ఎందుకంత డిమాండ్..! ఈశాన్యంలో టాయిలెట్ ఉండొచ్చా..?

ఇల్లు క‌ట్టుకునే ప్ర‌తి ఒక్క‌రూ వాస్తు నియ‌మాల‌ను పాటిస్తారు. ఒక‌టికి రెండుసార్లు వాస్తు నిపుణుల‌ను పిలిపించి.. ఇంటి నిర్మాణం గురించి చ‌ర్చిస్తుంటారు. ఏ దిక్కులో ఏ నిర్మాణం చేప‌ట్టాల‌నే దానిపై అవ‌గాహ‌న పెంచుకుంటారు. ఇక వాస్తు నిపుణులు సూచించిన మాదిరిగానే ఇంటి నిర్మాణాన్ని చేప‌డుతారు. అయితే భ‌విష్య‌త్ అంతా సాఫీగా సాగిపోవాలంటే.. ఇంటి నిర్మాణ‌మే ముఖ్య‌మ‌నేది గ్ర‌హించాలి. ఎందుకంటే ఏ చిన్న పొర‌పాటు జ‌రిగినా.. జీవితాంతం బాధ‌ప‌డాలి. దీంట్లో భాగంగా ఈశాన్య దిశ‌కు ఇంటి నిర్మాణంలో అత్యంత ప్రాధాన్య‌త ఉంది. కాబ‌ట్టి ఈశాన్యం దిశ‌లో ఏం ఉండాలో.. ఏం ఉండ‌కూడ‌దో తెలుసుకుందాం..

ఈశ్వరుని స్థానం ఈశాన్యం

దిక్కుల్లో తూర్పునకు ఎంత ప్రాధాన్యం ఉందో విదిక్కుల్లో ఈశాన్యానికి అంతే ప్రాధాన్యం ఉంటుంది. సాక్షాత్తు ఆ ఈశ్వరుడే ఈశాన్య దిక్కుకి అధిపతిగా ఉండి ఇంట్లోని వారిని సదా రక్షిస్తూ ఉంటాడు. ఈశాన్య దిక్కులో వాస్తు పురుషుని శిరస్సు ఉంటుందని చెబుతారు. ఈశాన్యం లేని స్థలం ప్రాణం లేని శరీరం వంటిది.

ఈశాన్యంలో టాయిలెట్స్ ఉండొచ్చా!

ఈశాన్యంలో టాయిలెట్స్ నిర్మించ‌రాద‌ట‌. ఒక వేళ నిర్మిస్తే దారిద్య్రానికి ఆహ్వానం ప‌లికిన‌ట్లేన‌ని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మంచినీళ్ల‌లా డ‌బ్బు ఖ‌ర్చు అవుతుంద‌ని అంటున్నారు. ఈశాన్యంలో టాయిలెట్ నిర్మించ‌డం వ‌ల్ల‌ ఇంట్లో నివసించే స్త్రీలకూ దుఃఖాన్ని తెచ్చిపడుతుంది.

ఈశాన్యంలో బరువు పెట్టొచ్చా..?

ఇంటికి అష్టైశ్వ‌ర్యాల‌ను తెచ్చి పెట్టే ఈశాన్యంలో చీపురు పుల్ల అంత బరువు కూడా పెట్టకూడదు. ఈశాన్యంలో ఎలాంటి బరువులు పెట్టకూడదు, ఎటువంటి కట్టడాలు కూడా కట్టకూడదు. అలా ఉంటే ఆ ఇంట్లో నివసించే వారికి ఆర్థిక పురోభివృద్ధి ఉండదు. అంతే కాకుండా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడి విపరీతంగా ధనవ్యయం చేయాల్సి వస్తుంది.

ఈశాన్యం ఐశ్వర్యం

ఈశాన్యం వాస్తు శాస్త్రం ప్రకారం ఉంటే ఆ ఇంటి యజమాని, ఇల్లాలు ఎప్పుడూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. అలాగే సంతానం కూడా మంచి చదువులతో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఎల్లప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతారు.

ఈశాన్యంలో మొక్కలు పెంచవచ్చా!

ముందుగా మనం చెప్పుకున్నట్లు ఈశాన్యంలో ఎలాంటి బరువు ఉంచకూడదు. అవి మొక్కలైనా సరే! పెద్ద పెద్ద చెట్లు అసలే నిషేధం కనీసం చిన్నపాటి మొక్కలు కూడా పెంచరాదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Exit mobile version