పెళ్లైన దంపతులందరూ సంతానం కోసం కలలు కంటారు. కొంతమంది వివాహితలు తమకు తెలియకుండానే గర్భం దాల్చుతారు. కొందరు గర్భం దాల్చరు. ఇలాంటి వారు అనేక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతారు. పేరు మోసిన ప్రతి డాక్టర్‌ను సంప్రదిస్తారు. అయినా కూడా వారు గర్భం దాల్చరు. పెళ్లైన తర్వాత చాలా ఏండ్లకు కూడా సంతానం కలగని వారు ఉన్నారు. సంతానం కలగని దంపతుల బాధ వర్ణాతీతం. ఆ బాధలు బయటకు చెప్పుకోలేరు. సంతానం కలగకపోవడంతో బాధపడే ప్రతి వివాహిత.. ప్రతి గురువారం తన ఇంట్లోనే లక్ష్మీదేవి వ్రతాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా సంతానం కోరిక నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతం చేపట్టిన కొద్ది రోజులకే గర్భం దాల్చే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
మరి సంతాన లక్ష్మీ వ్రతం ఎలా చేయాలి..?
సంతాన లక్ష్మీ వ్రతం చేయాలనుకునే వివాహిత.. ప్రతి గురువారం వేకువజామునే మేల్కొని ఇల్లును పరిశుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత అభ్యంగనస్నానం ఆచరించాలి. పూజా గదిని శుభ్రం చేసి, పూలతో అలంకరించాలి. సంతాన లక్ష్మీదేవి చిత్రపటాన్ని అలంకరించాలి. ముందుగా గణపతి స్తోత్రం చదవాలి. ఆ తర్వాత సంతాన లక్ష్మీదేవిని పూజించాలి.
లక్ష్మీ వ్రతం చేసే సమయంలో ఈ స్తోత్రం పఠించాలి..
అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయతే
జయ జయహే మధుసూదన కామిని, సంతాన లక్ష్మీ పరిపాలయ మామ్..
ఈ స్తోత్రం పఠించిన అనంతరం లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, అక్షతలు, ధూపదీపం, పాలతో చేసిన అన్నం పాయసం నైవేద్యంగా సమర్పించాలి. ఒక్క పూట ఉపవాసం ఉండాలి. సంతానం కలిగిన ముగ్గురు ముత్తయిదులకు తాంబూలం ఇచ్చి వారి నుంచి ఆశ్వీరాదం తీసుకోవాలి. సాయంత్రం మరోసారి దీపం వెలిగించి పై స్తోత్రం పఠించి ఉపవాసం విడవాలి. ఇలా ప్రతి గురువారం చేసినట్లయితే వీలైనంత త్వరగా సంతానం కలిగే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు.