Ashadha Masam | రేప‌ట్నుంచి ఆషాఢ మాసం ప్రారంభం.. కొత్త దంప‌తుల‌కు నెల రోజులు ఎడ‌బాటు..!

Ashadha Masam | ఆషాఢ మాసం.. జులై 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసం నెల రోజుల పాటు కొన‌సాగ‌నుంది. అంటే ఆగ‌స్టు 4వ తేదీ వ‌ర‌కు ఆషాఢ మాసం ఉంటుంది. ఇక కొత్త‌గా పెళ్లి చేసుకున్న జంట‌ల‌ను కూడా ఆషాఢ మాసం కొద్ది రోజుల పాటు దూరం చేస్తోంది. మెట్టినింటి నుంచి పుట్టినింటికి వెళ్తుంది న‌వ వ‌ధువు. అస‌లు కొత్త దంప‌తుల‌కు ఈ నెల రోజుల పాటు ఎందుకు ఎడ‌బాటు..? ఈ ఎడ‌బాటు వెనుకాల ఉన్న కార‌ణాలు ఏంటో తెలుసుకుందాం..

  • Publish Date - July 4, 2024 / 06:58 AM IST

Ashadha Masam | ఆషాఢ మాసం.. జులై 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసం నెల రోజుల పాటు కొన‌సాగ‌నుంది. అంటే ఆగ‌స్టు 4వ తేదీ వ‌ర‌కు ఆషాఢ మాసం ఉంటుంది. ఇక ఆషాఢ మాసంలో చాలా వ‌ర‌కు కొత్త ప‌నులు ప్రారంభించ‌రు. ఈ మాసాన్ని కొంద‌రు శుభ‌ప్ర‌దంగా భావించ‌రు. ఇక కొత్త‌గా పెళ్లి చేసుకున్న జంట‌ల‌ను కూడా ఆషాఢ మాసం కొద్ది రోజుల పాటు దూరం చేస్తోంది. మెట్టినింటి నుంచి పుట్టినింటికి వెళ్తుంది న‌వ వ‌ధువు. ఆషాఢ మాసం ముగిసే వ‌ర‌కు వ‌ధువు పుట్టినింట్లోనే ఉంటుంది. ఈ నెల రోజుల పాటు అల్లుడు కూడా అత్త‌గారింటికి వెళ్ల‌నివ్వ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. అస‌లు కొత్త దంప‌తుల‌కు ఈ నెల రోజుల పాటు ఎందుకు ఎడ‌బాటు..? ఈ ఎడ‌బాటు వెనుకాల ఉన్న కార‌ణాలు ఏంటో తెలుసుకుందాం..

కొత్త దంప‌తుల ఎడ‌బాటుకు కార‌ణాలివే..!

ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో పెళ్లి చేసుకున్న దంప‌తులు.. ఒక నెల, రెండు నెల‌ల పాటు త‌మ దాంప‌త్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆ త‌ర్వాత పిల్ల‌ల్ని క‌నేందుకు ప్లాన్ చేసుకుంటారు. అయితే ఆషాఢ మాసంలో నెల త‌ప్పితే.. ప్ర‌స‌వం స‌రిగ్గా ఎండాకాలంలో అయ్యే అవ‌కాశం ఉంటుంది. ఎండ‌లు త‌ల్లీబిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తాయి. ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా అధిక ర‌క్త‌స్రావం జరిగే అవ‌కాశం కూడా ఉంటుంది. ఎండాకాలంలో సంభ‌వించే అనారోగ్య కార‌ణాల చేత ఆషాఢ మాసంలో కొత్త దంప‌తుల క‌ల‌యిక మంచిది కాద‌నేది ఒక అభిప్రాయం.

ఇక రెండో విష‌యానికి వ‌స్తే.. గ‌తంలో కుటుంబం అంతా కలసి వ్యవసాయపనులు చేసేవారు. ఒక్కరు తగ్గినా పనులు ముందుకుసాగేవికాదు. కొత్తగా పెళ్లైన జంట ఇంట్లో ఉంటే వ్యవసాయ పనులకు అడ్డంకి ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే ఆషాఢంలో ఎడబాటు అనే నియమం పాటించడం మొదలెట్టారు. కొత్త అల్లుడు అత్తింటి గడపతొక్కకూడదు అని చెప్పడం వెనుకున్న ఆంతర్యం కూడా ఇదే.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు.. కొత్తగా పెళ్లి చేసుకుని అత్తింట్లో అడుగుపెట్టిన అమ్మాయి పుట్టింటికి ఒక్కసారిగా దూరం అయిపోవాల్సి ఉంటుంది. కొత్త వాతావరణంలో అడుగుపెట్టిన తర్వాత తిరిగి పుట్టింట్లో నెల రోజులు ఉంటే అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా ఉండాలో, ఆ కుటుంబంలో ఒకరిగా ఎలా మెలగాలో…పెద్దలు నేర్పించి పంపించేవారు. ఇక ఆషాఢ మాసంలో వాతావారణంలో వచ్చే మార్పులు, పొలం పనులు కారణంగా చేతులు, పాదాలపై ఇన్ఫెక్షన్‌కు గురవుతాయి. అందుకే ఈ నెలలో గోరింట పెట్టుకోవాలి అనే సంప్రదాయం తెచ్చిపెట్టారు. అందుకే ఆడ‌పిల్ల‌ల చేతులు గోరింటాకుతో క‌ళ‌క‌ళ‌లాడిపోతుంటాయి.

Latest News