Dakshinamurthy | ద‌క్షిణామూర్తి ఎవరు..? గురువార‌మే ఎందుకు పూజించాలి..?

  • Publish Date - April 11, 2024 / 06:08 AM IST

Dakshinamurthy | జ్ఞాన సంపాద‌న‌కు, మోక్ష సాధ‌న‌కు ఉత్త‌మ‌మైన జ‌న్మ‌.. మాన‌వ జ‌న్మ ఒక్క‌టే. అలాటి మానవ జీవితంలో చోటుచేసుకునే దుఃఖాల‌ను తొల‌గించి, జ్ఞానాన్ని ప్ర‌సాదించే ఏకైక దైవం గురు ద‌క్షిణామూర్తి అని జ్యోతిష్య పండితులు తెలిపారు.

కాబ‌ట్టి ప్ర‌తి ఇంట్లో ద‌క్షిణామూర్తి ప‌టాన్ని ఉంచుకోవాల‌ని సూచిస్తున్నారు. ఇక ప్ర‌తి గురువారం ప‌ది నిమిషాల పాటు ద‌క్షిణామూర్తి స్తోత్రాన్ని ప‌ఠిస్తారో వారికి అన్ని శుభాలు క‌లుగుతాయ‌ని విశ్వాసం. దక్షిణామూర్తిని చూసేటటువంటి వారికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించేటటు వంటి వారికి తెలియక చేసినటువంటి పాపములు నశిస్తాయి. వారికి రాబోవు కష్టములు తొలగించి వారిని దక్షిణామూర్తి రక్షిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

దక్షిణామూర్తి స్వరూపం, దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడి చెవికి మకరకుండలం ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి. మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం. తాటంకం స్త్రీల అలంకృతి, దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి. ఈ రెండు అలంకారాలు. సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా. ఈ విషయాన్నే లలితాసహస్రంలో దక్షిణామూర్తి రూపిణీ సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ అని వివరిస్తోంది.

దక్షిణామూర్తి అనేది అన్ని రకాల జ్ఞానం, గురువు. ఈ రూపం శివుడిని యోగా, సంగీతం, జ్ఞానానికి గురువుగా సూచిస్తుంది. శాస్త్రాలపై వివరణ ఇస్తుంది. హిందూ గ్రంధాల ప్రకారం, ఒక వ్యక్తికి గురువు లేకుంటే, వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు. చివరికి వారు యోగ్యులైతే, స్వీయ-సాక్షాత్కార మానవ గురువుతో ఆశీర్వాదం పొందుతారు.

ఆది గురువుగా చెప్పబడ్డ మహేశ్వరుని రూపం దక్షిణామూర్తి. బ్రహ్మ విద్యా ప్రాప్తి కోసం సనక సనందనాదులు సదా శివుని వద్దకు వెళ్ళారు. ఆ సమయంలో శివుడు గౌరి సమేతుడై దేవ గణాల మధ్యన నాట్యం చేస్తు న్నాడు. ఈ నృత్య గీత వినోదుడైన సంసారి తమకు బ్రహ్మ విద్యలను ఎలా బోధిస్తాడని అనుమానంతో వెనక్కి తిరిగారు. అలా తిరగగానే శివుడు యువకుడి రూపంలో సందేహాలను నివృత్తి చేస్తున్నాడు. ఆయనే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ద్వారా సనక సనందనాదులు బ్రహ్మజ్ఞానం పొందినట్లు చెప్పబడింది. శివుని యొక్క జ్ఞాన స్వరూపం దక్షిణామూర్తి. మహా విష్ణువు యొక్క జ్ఞాన రక్షణ అవతారం.