Site icon vidhaatha

రేపే హ‌నుమాన్ జ‌యంతి.. త‌మ‌ల‌పాకుతో పూజిస్తే ఎన్ని ఉప‌శ‌మ‌నాలో తెలుసా..?

మంగ‌ళ‌వారం నాడు హ‌నుమాన్ జ‌యంతి జ‌రుపుకునేందుకు భ‌క్తులంతా సిద్ధ‌మవుతున్నారు. ఆంజ‌నేయుడిని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో కొలిచి మొక్కులు తీర్చుకునేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. గ్ర‌హ‌దోషాల నుంచి విముక్తి పొందేందుకు, ఆయురారోగ్యాల కోసం హ‌నుమంతుడిని పూజిస్తారు. ఇక పూజ‌లో భాగంగా కొంద‌రు హ‌నుమంతుడికి ఇష్ట‌మైన సింధూరంను స‌మ‌ర్పిస్తారు. మ‌రికొంద‌రు వ‌డ‌మాల స‌మ‌ర్పిస్తారు. ఇంకొంద‌రు త‌మ‌ల‌పాల‌కుతో పూజించి మొక్కులు తీర్చుకుంటారు. మ‌రి హ‌నుమంతుడికి త‌మ‌ల‌పాకులంటే ఎందుకంత ఇష్టం.. అనే విష‌యాల‌ను తెలుసుకుందాం. అంతేకాకుండా త‌మ‌ల‌పాకుతో ఆంజ‌నేయుడిని పూజిస్తే చాలా ఉప‌శ‌మ‌నాలు కూడా క‌లుగుతాయి.

త‌మ‌ల‌పాకుల వెనుకాల ఉన్న క‌థ ఇదే..!

రావ‌ణుడు సీత‌ను అప‌హ‌రించిన త‌ర్వాత ఆమె జాడ‌ను తెలుసుకునేందుకు లంక‌కు హ‌నుమంతుడు వెళ్తాడు. జాడ తెలుసుకున్న త‌ర్వాత శ్రీరాముడి వ‌ద్ద‌కు ఆంజ‌నేయుడు తిరిగి వ‌స్తుండ‌గా.. వాన‌రులు అంద‌రూ ఎదురుచూస్తుంటారు. ఇక ఆంజ‌నేయుడికి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికేందుకు ఆ వ‌నంలోని ఆకులు, పూలు.. ముఖ్యంగా త‌మ‌ల‌పాకుల‌ను మెడ‌లో వేసి స్వాగ‌తం ప‌లికిన‌ట్లు పండితులు చెబుతుంటారు. దీంతో ఆంజ‌నేయుడికి త‌మ‌ల‌పాకులు అంటే ఎంతో ప్రీతి అని చెబుతారు. మ‌రో ముఖ్య విషయం ఏంటంటే ఆంజనేయస్వామి సహజంగా ఉగ్రస్వరూపుడు. తమలపాకుల దండ స్వామికి అలంకరించడం వల్ల స్వామి ఉగ్రస్వరూపం వీడి శాంత స్వరూపంతో భక్తులను అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. అందుకే హనుమను తమలపాకులతో పూజించడం వలన సకల అభీష్ఠాలు సిద్ధిస్తాయ‌ని భ‌క్తులు న‌మ్ముతుంటారు.

ఎన్ని ఉపశమనాలో తెలుసా..?

ఆంజనేయ స్వామికి తమల పాకుల హారాన్ని వేస్తే వైవాహిక జీవితంలో కలతలు తొలగిపోతాయ‌నేది భ‌క్తుల న‌మ్మ‌కం. శ‌నిదోషం వెంటాడుతున్న వారు కూడా హ‌నుమంతుడిని త‌మ‌ల‌పాకుల‌తో పూజిస్తే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ట‌. ఉద్యోగం, వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు కూడా మాయ‌మ‌వుతాయ‌ట‌. అనారోగ్య స‌మ‌స్య‌లు, గ్ర‌హ సంబంధ పీడ‌లు తొల‌గిపోతాయ‌ట‌. నిత్యం అనారోగ్యంతో బాధపడే పిల్లల పేరుమీద ఆంజనేయుడికి ఈ ఆకుల‌తో పూజచేస్తే త్వరగా కోలుకుంటారు. మరీ ముఖ్యంగా సుందరకాండ పారాయణం చేసి హనుమాన్‌కి తమలపాకు హారం సమర్పిస్తే చేపట్టే అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది.

Exit mobile version