Ugadi 2024 | తెలుగు క్యాలెండర్ ప్రకారం.. కొత్త సంవత్సరం తొలి రోజున జరుపుకునే పండుగ ఉగాది. ఈ ఉగాది ఏప్రిల్ 9వ తేదీన జరుపుకోనున్నారు. ఇక ఉగాదికి ముందు రోజు అమావాస్య వస్తుంది. కాబట్టి అందరూ అమావాస్యపై దృష్టి పెడుతారు. ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్య రోజు ఏ కార్యక్రమాలు చేయాలి..? ఏ పనులు చేస్తే మేలు జరుగుతుంది..? అనే విషయాలపై ఆలోచిస్తూ తర్జనభర్జన పడుతుంటారు. అయితే ఈ అమావాస్య రోజున ఉపవాసం ఉండి, ఆ పరమశివుడిని పూజించాలని శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల కొత్త తెలుగు సంవత్సరం క్రోధి నామ సంవత్సరమంతా మేలు జరుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఏప్రిల్ 8న వచ్చే అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే మేల్కొనాలి. ఉపవాసం ఉంటూ ఆ పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి. సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరూ తమ నివాసాల్లో సాయంత్రం వేళ కచ్చితంగా దీపాలను వెలిగించాలి. పేదలకు వస్త్రాలను దానం చేయాలి. అలాగే ఈ రోజున పూర్వీకులకు తర్పణం చేయాలి. ఆ రోజున పూర్వీకులను సంతృప్తి పరిస్తే మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అంతేకాకుండా ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి. ఆ ఇంట సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.
భార్యాభర్తలు కలయికకు దూరంగా ఉండాలట..!
అమావాస్య రోజున ఎవరూ కూడా పగటిపూట నిద్రించకూడదని పండితులు సూచిస్తున్నారు. బ్రహ్మచార్యాన్ని కచ్చితంగా పాటించాలి. భార్యాభర్తలు కలయికకు దూరంగా ఉంటే మంచిది. నలుపు రంగు దుస్తులు అసలు ధరించకూడదు. వెల్లుల్లి, ఉల్లి, మాంసం, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. కోపాన్ని నియంత్రించుకుంటే మంచిది.