హిందూ సంప్రదాయంలో ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజిస్తారు. హనుమాన్ భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన తమలపాకులతో పూజిస్తారు. వడమాల కూడా సమర్పిస్తుంటారు. అంతేకాకుండా జీవితంలో ఓటమి అనేది ఉండకూడదు.. అష్టైశ్వర్యాలు కలగాలంటే.. ప్రతి మంగళవారం హనుమంతుడిని జిల్లేడు మాలతో పూజించాలని పండితులు సూచిస్తున్నారు.
వృక్ష జాతిలోనే జిల్లేడు చెట్టు ఎంతో విశిష్ఠతమైనది. ఇందులో విషపూరితమైన వాయువు అలాగే అందులో నుండి వచ్చే పాలు కూడా విషపూరితమైనవి. కాబట్టి ఈ చెట్టును ఇంట్లో పెంచుకోవడానికి అసలు ఇష్టపడరు. కానీ ఈ చెట్టు లోని వేర్లు వినాయకుడి రూపం కలిగి ఉంటాయి. ఈ చెట్టు ఆకులు హనుమంతుడికి ఇష్టం. అందుకే జిల్లేడు చెట్టు ఉన్న చోట ఆ భూమి ఎంతో సంపూర్ణం అవుతుంది అని అంటారు. ఇక పల్లెలలో ఈ చెట్లు ఉన్న చోట పంటలు బాగా పండుతాయని నమ్ముతారు.
రాశుల వారి జాతకంలో ఉన్న కొన్ని దోషాల కారణంగా అనారోగ్యానికి గురైనప్పుడు పీడ కలలు వస్తుంటాయి. అలా వస్తున్న వారు జిల్లేడు చెట్టు వద్దకు వెళ్లి ఆ చెట్టుకి పసుపు కుంకుమతో పూజ నిర్వహిస్తే పీడ కలలు రావట. అలాగే ఆ చెట్టు ఆకులతో మాల తయారు చేసి ప్రతి ఒక్క ఆకుపై పసుపు కుంకుమ బొట్టును పెట్టి.. జై హనుమాన్ అని స్మరిస్తూ హనుమంతుడికి పూజలు నిర్వహిస్తే మంచిదట. ఇక జిల్లేడు మాలను హనుమంతుడి మెడలో వేసినట్లయితే ఇక వారి జీవితంలో ఓటమి అనేది ఉండదు అని అర్చకులు అన్నారు. అలాగే ప్రతి మంగళవారం జిల్లేడు మాలతో పూజలు నిర్వహిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని .. అలాగే చెడు కలల నుండి విముక్తి దొరుకుతుంది అని పండితులు చెబుతున్నారు.