King Cobra | ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం మహానంది ఆలయానికి నిన్న భక్తులు పోటెత్తారు. నవరాత్రుల్లో భాగంగా ఆ నందీశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. అయితే భక్తుల మధ్యలో అనుకోని, ఎవరూ ఊహించని అతిథి వచ్చి చేరింది. ఆ అతిథి ఎవరో కాదు.. సాక్షాత్తు ఆ నాగేంద్రుడు.
భక్తుల క్యూలైన్‌లో నాగుపామును చూసి భక్తులు ఒకింత భయాందోళనకు గురయ్యారు. అయినా కూడా మనసులో ఆ నాగేంద్రుడిని స్మరిస్తూనే ఆలయ సిబ్బందికి సమాచారం అందించారు. వారు అప్రమత్తమై స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించగా, అతను వచ్చి.. బుసలు కొడుతున్న నాగుపామును బంధించాడు.
స్నేక్ స్నాచర్ మోహన్ నాగుపామును చాకచక్యంగా పట్టుకొని సమీపంలోని నల్లమల అడవిలో వదిలిన పెట్టాడు. నాగుపామును బంధించడంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆలయంలో పామును చూడగానే మొదట భయపడినా.. నవరాత్రుల శుభవేళ శివాలయంలో ఇలా నాగుపాము కనిపించడం దైవలీల అని, పరమేశ్వరుడే ఇలా దర్శనమిచ్చారని కొందరు భక్తులు నాగదేవతకు భక్తితో మొక్కారు.