Site icon vidhaatha

Saibaba । వారణాసి ఆలయాల్లో సాయిబాబా విగ్రహాల తొలగింపుపై కాంగ్రెస్‌, బీజేపీ ఆగ్రహం

Saibaba । సనాతన్‌ రక్షక్‌ దళ్‌ అనే గ్రూపు పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలను తొలగించడం వివాదాస్పదంగా మారింది. వారణాసిలోని బడా గణేష్‌ ఆలయంలోని సాయి విగ్రహాన్ని సైతం సనాతన్‌ రక్షక్‌ దళ్‌ సభ్యులు తొలగించి, ఆలయం ప్రాంగణం బయట పడేశారు. ఎలాంటి జ్ఞానం లేకుండా సాయిబాబాను పూజిస్తున్నారని, మత గ్రంథాల ప్రకారం అది చెల్లదని ఆలయ ప్రధాన అర్చకుడు రమ్ము గురు చెప్పారు. అన్నపూర్ణ ఆలయం ప్రధాన అర్చకుడు శంకర్‌ పురి సైతం ఇదే తరహా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మత గ్రంథాల్లో సాయిబాబాను పూజించడంపై ఎలాంటి ప్రస్తావన లేదని చెప్పారు. వారణాసిలో దేవదేవుడు శివుడికి మాత్రమే పూజలు నిర్వహించాలని సనాతన్‌ రక్షక్‌ దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్‌ శర్మ తేల్చి చెప్పారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఇప్పటి వరకూ పది ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలను తొలగించినట్టు తెలిపారు. అగస్త్యకుండ, భుటేశ్వర్‌ ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలను కూడా తొలగిస్తామన్నారు.

అయితే.. వారణాసిలోని సంత్‌ రఘువీర్‌దాస్‌ నగర్‌లోని సాయిబాబా ఆలయ అర్చకుడు సమర్‌ఘోష్‌ మాత్రం ఈ చర్యలను వ్యతిరేకించారు. ఈ రోజు సనాతనవాదులమని చెప్పుకొంటున్నవారే సాయిబాబా ఆలయాలను గతంలో నిర్మించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు వారే ఆలయాల నుంచి సాయి విగ్రహాలను తొలగిస్తున్నారని అన్నారు. ‘దేవుళ్లందరూ ఒక్కటే. ఏ రూపంలోనైనా దేవుడిని చూడొచ్చు. ఇటువంటి చర్యలు సరైనవి కావు. అవి ప్రజల విశ్వాసాలను దెబ్బతీస్తాయి. సమాజంలో వైషమ్యాలను వ్యాప్తి చేస్తాయి’ అని ఘోష్‌ చెప్పారు. సాయిబాబా విగ్రహాలను తొలగించడం తీవ్ర ఆందోళనకలిగించే అంశమని సాయి భక్తుడు వివేక్‌ శ్రీవాస్తవ అన్నారు. ‘కోట్ల మంది సాయి భక్తుల విశ్వాసాన్ని ఈ చర్య దెబ్బతీస్తుంది. దేవుళ్లంతా ఒక్కటే. వారు నమ్మిన రీతిలో దేవుడిని కొలుచుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నది. సాయిబాబా హిందువా? ముస్లిమా? అన్న ప్రశ్న వస్తే.. ఆ భేదాలు సృష్టించింది మనమే. మనుషుల పట్ల దేవుడు వివక్ష చూపడు’ అని ఆయన చెప్పారు.

ఇది రాజకీయంగా కూడా విమర్శలకు తావిస్తున్నది. పలువురు రాజకీయ నాయకులు ఈ చర్యలను ఖండించారు. మహారాష్ట్రలోని అధికార బీజేపీతోపాటు.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఈ చర్యను వ్యతిరేకించాయి. 19వ శతాబ్దినాటి సాధువు అయిన సాయిబాబాను అగౌరవపరిస్తే సహించేది లేదని హెచ్చరించాయి. సాయిబాబా పూజ్యనీయుడని, ఆయనను అవమానిస్తే సహించేది లేదని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బావన్‌కుళె అన్నారు. సాయి విగ్రహాల తొలగింపు కార్యక్రమాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేశారు. కుల, మత, వర్గాలకు సాయిబాబా అతీతుడని కాంగ్రెస్‌ నేత బాలాసాహెబ్‌ థోరత్‌ అన్నారు. వారణాసిలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

Exit mobile version