విధాత : అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు(Tirumala Brahmotsavam) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవదేవుడి బ్రహ్మోత్సవాలకు బ్రహ్మ సహా సకల దేవతలను..సుర మునులను ఆహ్వానించే ఘట్టం.. పరివార దేవతాహ్వానం, గరుడ పట(విశ్వక్సేన) ఊరేగింపు, సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవ పర్వం కొనసాగనుంది. రాత్రి 8గంటలకు సీఎం చంద్రబాబు( Chandrababu Naidu) భువనేశ్వరి దంపతులు ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం హోదాలో చంద్రబాబు శ్రీవారికి 15వ సారి పట్టువస్త్రాలు సమర్పిస్తుండటం విశేషం. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. టీటీడీ (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
రాత్రి పెద్ద శేషవాహన సేవ
బుధవారం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరగనుంది. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు దేవేరులతో కలిసి మలయప్పస్వామి వివిధ వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. 28వ తేదీన గరుడవాహనం మాత్రం సాయంత్రం 6.30 గంటలకే మొదలుకానుంది. శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలతో తిరుమల కొండలు ప్రత్యేక అలకంరణలతో..అధ్యాత్మిక వెలుగులతో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. టీటీడీ దాదాపు రూ.25 కోట్లతో ఏర్పాట్లను చేపట్టింది. పుష్ప, విద్యుద్దీపాలంకరణలతో తిరుమల కొండ భక్తులకు కనువిందు చేస్తోంది. ఈ ఏడాది రూ.5.30 కోట్లతో అలిపిరి గరుడ సర్కిల్ నుంచి శ్రీవారి ఆలయం వరకు విద్యుద్దీపాలంకరణ చేపట్టారు. శ్రీవారి ఆలయంతో పాటు జీఎన్సీ టోల్‌గేట్ నుంచి ఆర్టీసీ బస్టాండ్, వైకుంఠం క్యూకాంప్లెక్స్, మాడవీధులు, అన్నప్రసాదభవనం, ఆస్థానమండపం, లడ్డూకౌంటర్ వంటి ప్రధాన ప్రాంతాలతో పాటు రోడ్లకు ఇరువైపులా, పార్కులు, వాటర్‌ఫౌంటెన్లు, ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా విద్యుద్దీపాలంకరణలు చేశారు.
ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణ
ఏటా బ్రహ్మోత్సవాలలో 8 నుంచి 10 టన్నుల చేసే పుష్పాలంకరణను దాతల సహకారంతో ఈ ఏడాది 18 టన్నుల సంప్రదాయ పుష్పాలతో స్వామి క్షేత్రాన్ని ముస్తాబు చేశారు. 6 టన్నులతో శ్రీవారి ఆలయంలోపల, మరో 12 టన్నులతో వెలుపల పుష్పాలంకరణ చేశారు. లక్ష కట్ ఫ్లవర్స్‌లో ఆలయంలోని ధ్వజస్తంభం ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. గరుడసేవ ముందురోజు, మహారథం ముందురోజు ఈ పుష్పాలంకరణలను మార్చనున్నారు. ఈఏడాది ప్రత్యేకంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్1, జీఎన్సీ టోల్‌గేట్ వద్ద పుష్పాలంకరణలు చేశారు.
తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు నేరుగా దర్శనం కల్పిస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మధ్యాహ్నం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశముండటంతో ఈ చర్యలు చేపట్టారు. నిన్న శ్రీవారిని 63,837 మంది భక్తులు దర్శించుకున్నారు.