Vaikunta Ekadashi | పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదినానికి ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. హిందువులందరూ ఈ పర్వదినాన ఉపవాస దీక్ష చేసి.. మోక్షాన్ని పొందేందుకు సిద్ధమవుతున్నారు. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి రోజున స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. ఈ పుణ్య దినాన విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు. అయితే ఆ రోజున(డిసెంబర్ 30) న విష్ణువు ఆలయాన్ని సందర్శించి, ఉపవాస దీక్ష ఆచరించి, రాత్రంతా జాగరణ చేస్తే పుణ్య ఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలో ఆలయాలకు ఏ సమయంలో వెళ్లాలి..? పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆలయ సందర్శనకు ఉత్తమ సమయం ఇదే..
వైకుంఠ ఏకాదశి తేదీ: డిసెంబర్ 30, 2025 (మంగళవారం)
ఏకాదశి తిథి ప్రారంభం: డిసెంబర్ 30 ఉదయం 7:51 గంటలకు.
ఏకాదశి తిథి ముగింపు: డిసెంబర్ 31 ఉదయం 5:01 గంటలకు.
ఉదయ తిథి ప్రకారం: డిసెంబర్ 30న పండుగ జరుపుకోవాలి.
పాటించాల్సిన నియమాలు:
స్నానం, సంకల్పం: తెల్లవారుజామునే నిద్రలేచి, స్నానమాచరించి విష్ణుమూర్తిని ధ్యానించాలి.
ఉపవాసం: రోజంతా నిరాహారంగా ఉండాలి. సాధ్యం కాని వారు పండ్లు లేదా తులసి తీర్థం తీసుకోవచ్చు.
పూజ: లక్ష్మీనారాయణులకు ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి.
జాగారం: ఏకాదశి రాత్రి నిద్రపోకుండా భగవంతుని నామస్మరణతో జాగారం చేయాలి.
దానం: ద్వాదశి రోజున (డిసెంబర్ 31) బ్రాహ్మణులకు లేదా పేదలకు అన్నదానం చేసి, ఆ తర్వాతే ఉపవాసం విరమించాలి.
ముందస్తు నియమం: ఏకాదశికి ముందు రోజు (డిసెంబర్ 29) సాయంత్రం నుంచే సాత్విక ఆహారం తీసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి మరియు నేలపై నిద్రించడం ఉత్తమం.
