Site icon vidhaatha

మూఢం అంటే ఏమిటి..? ఆ రోజుల్లో శుభ‌కార్యాలు చేస్తే ఏమవుతుంది..?

మ‌రో రెండు రోజుల్లో మంచి రోజులు స‌మాప్తం కానున్నాయి. ఏప్రిల్ 22వ తేదీతో శుభ ముహుర్తాలు అయిపోతున్నాయి. వ‌చ్చే మూడు నెల‌ల వ‌ర‌కు ముహుర్తాలు లేవ‌ని జ్యోతిష్యులు చెబుతున్నారు. మ‌రో నాలుగైదు రోజుల్లో మూఢం వ‌చ్చేస్తోంది. మ‌రి మూఢం అంటే ఏమిటి..? మూఢం రోజుల్లో శుభ‌కార్యాలు చేయొచ్చా..? చేస్తే ఏమ‌వుతుంది..? మ‌రి ఏ కార్యాలు చేయొచ్చు.. చేయ‌కూడ‌దు అనే విష‌యాల‌ను తెలుసుకుందాం..

మూఢం అంటే ఏమిటి..?

పురాణాల్లో గ్ర‌హాలు, వాటి సంచారానికి అధిక ప్రాధాన్య‌త ఉంటుంది. మూఢం అనేది గ్ర‌హాల స్థితి కార‌ణంగా శుభ‌కార్యాల‌కు స‌రైన స‌మ‌యం కాద‌ని పండితుల అభిప్రాయం. నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. వీటిలో భూమి కూడా ఓ గ్రహమే. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమ్మీద ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారట. ఈ సమయంలో శుభ కార్యాలు చేయకూడదని అంటారు. ఇక మూఢాలు రెండు రకాలు గురు మూఢం, శుక్ర మూఢం.

ఆ రోజుల్లో ఎలాంటి శుభ‌కార్యాలు చేయ‌కూడ‌దు..!

గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోయి బలహీనమవుతుంది. అలా గురు గ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మూఢం, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మూఢం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. అందుకే.. గురు, శుక్ర గ్రహాలు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు. ఎందుకంటే.. ఏ శుభకార్యానికి అయినా గురు, శుక్ర గ్రహాల బలమే ప్రధానం అంటారు. ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలసిరాదని పండితులు చెబుతున్నారు.

మూఢంలో శుభకార్యాలు చేస్తే ఏమవుతుంది?

జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్న దాని ప్రకారం.. మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అశుభాలు క‌లుగుతాయ‌ని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఏదైనా కష్టం కలగొచ్చని, ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అందుకే.. మూఢం సమయంలో ఏ శుభకార్యమూ తలపెట్టకూడదని సూచిస్తుంటారు.

మూఢంలో ఈ ప‌నులు అస‌లు చేయ‌కూడ‌దు..

పెళ్లిళ్లు నిర్వ‌హించ‌రాదు. పుట్టు వెంట్రుక‌లు తీయొద్దు. ఇల్లు మారొద్దు, గృహానికి సంబంధించి ప‌నులు ప్రారంభించొద్దు.

ఈ ప‌నులు చేసుకోవ‌చ్చు..

అన్నప్రాస‌న చేసుకోవ‌చ్చు. భూములు, నూత‌న వాహ‌నాలు కొనుగోలు చేయొచ్చు. నూత‌న ఉద్యోగాల్లో చేరొచ్చు. ఇంటి రిపేర్లు చేసుకోవ‌చ్చు. విదేశాల‌కు ప్ర‌యాణం చేయొచ్చు.

Exit mobile version