Bonalu Festival | రేప‌ట్నుంచే ఆషాడ బోనాల జాత‌ర.. బోనం అంటే ఏమిటి..?

Bonalu Festival | తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో రేప‌ట్నుంచి ఆషాడ బోనాల జాత‌ర ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు ఈ బోనాల సంద‌డి కొన‌సాగ‌నుంది. పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో బోనాల పండుగ కోలాహాలంగా ఉంటుంది. ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదంటే ఆదివారం వేడుకలు ప్రారంభమవుతుంటాయి.

  • Publish Date - July 6, 2024 / 06:54 AM IST

Bonalu Festival | తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో రేప‌ట్నుంచి ఆషాడ బోనాల జాత‌ర ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు ఈ బోనాల సంద‌డి కొన‌సాగ‌నుంది. పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో బోనాల పండుగ కోలాహాలంగా ఉంటుంది. ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదంటే ఆదివారం వేడుకలు ప్రారంభమవుతుంటాయి. అయితే, బోనాల పండుగకు ఎంతో చారిత్ర పాశస్త్యం ఉన్నది. అజ్ఞాత యుగం నుంచే ఈ బోనాల సంప్రదాయం కొనసాగుతున్నది. కొండ కోన‌ల్లో మ‌నిషి జీవించిన కాలంలో ఒక రాయిని దేవ‌త‌గా చేసుకుని ప్రకృతి త‌న‌కు ఇచ్చిన ప‌త్రి, పువ్వు, కొమ్మ‌, ప‌సుపు కుంకుమ‌, నీళ్లు, ధాన్యం, కూర‌గాయ‌ల‌ను స‌మ‌ర్పించాడు. అప్పుడు ప్రారంభ‌మైన ఈ సమర్పణనే బోనాల వ‌ర‌కు వ‌చ్చింది.

తెలంగాణ సంప్రదాయానికి చిహ్నమైన బోనాన్ని మహిళలే తయారు చేస్తారు. బోనాల పండుగ సంద‌ర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మలకు పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లిస్తారు. తమ కుటుంబాన్ని సుఖశాంతులతో కాపాడాలని, తమకు ఏ ఆపద రాకుండా చూడాలని కోరుకుంటారు. ఈ పండుగ మొదటి, చివరి రోజు ఎల్లమ్మ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. హైదరాబాద్ గోల్కొండ కోట‌లో జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పిస్తారు. తర్వాత రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లికి, మూడో బోనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు.

బోనం అంటే ఏమిటి..?

బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారు. కొత్త మట్టి కుండ లేదా ఇత్తడి కుండలో పాలు, బెల్లం, బియ్యం వేసి నైవేద్యం త‌యారు చేస్తారు. వేప ఆకులు, పసుపు, కుంకుమతో కుండను అలంకరిస్తారు. మహిళలు అందంగా ముస్తాబై తల మీద ఈ కుండను మోస్తూ అమ్మ‌వారి ఆలయాలకు తీసుకుని వెళతారు. మహిళలు తాము సిద్ధం చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు.

ఆషాడ మాసంలో ఎందుకు చేస్తారు?

పురాణాల ప్రకారం ఆషాడ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళ్తుందని నమ్ముతారు. అందుకే ఈ పండుగ సమయంలో పెళ్ళైన ఆడపిల్లలు తమ పుట్టింటికి వస్తారు. అమ్మవారిని తమ కూతురిగా భావించి భక్తిశ్రద్ధలతో నైవేద్యాలు చేసి సమర్పిస్తారు. బోనాల సందర్భంగా మహిళలు పట్టుచీరలు, నగలు ధరించి అందంగా ముస్తాబు అవుతారు. బోనాలు తీసుకెళ్తున్న మహిళలను అమ్మవారు ఆవహిస్తారని నమ్ముతారు. వారిని శాంతపరిచేందుకు ఆలయం దగ్గర బోనం ఎత్తిన మహిళ కాళ్ళ మీద నీళ్ళు పోస్తారు.

పోత‌రాజు ప్ర‌త్యేక‌త‌..

అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక వ్యక్తి బోనాలకు ప్రాతినిధ్యం వాహిస్తాడు. ఎరుపు రంగు ధోతి ధరించి, కాళ్ళకు గంటలు ధరిస్తాడు. శరీయం అంతా పసుపు కుంకుమ రాసుకుంటాడు. నుదుటి మీద పెద్ద బొట్టు ధరించి డప్పులకు తగినట్టుగా నృత్యం చేస్తూ ఊరేగింపులో పాల్గొంటాడు. ఇతన్ని పూజా కార్యక్రమాలకు ఆరంభకుడిగా భావిస్తారు. పోతురాజు లేకుండా బోనం సందడే లేదు.