తెలంగాణ ఓవర్సీస్ మేన్‌పవర్ కంపెనీ(TOMCOM) అనేది తెలంగాణ ప్రభుత్వం(Govt. of Telangana)లోని కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ క్రింద పనిచేసే రిజిస్టర్డ్ నియామక ఏజెన్సీ(Registered Recruitment Agency). ఇది రాష్ట్రంలోని అర్హత, నైపుణ్యం కలిగిన యువతకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడంలో ఆయా దేశాలతో కలిసి పనిచేస్తుంది. TOMCOM గల్ఫ్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, హంగేరి, జపాన్, పోలాండ్, రొమేనియా, UAE, సౌదీ, UK వంటి వివిధ దేశాలలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీలతో భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకుంది.
ఈమధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలలో బైక్ రైడర్స్(Bike Riders)కు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. డెలివరీ బాయ్స్(Delivery Boys)గా పనిచేయడానికి ఆ దేశ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ నియామక ప్రక్రియ తెలంగాణలో టామ్‌కామ్ ద్వారా జరుగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని టామ్‌కామ్ తెలిపింది. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 3 సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యే భారత టూ-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే వయసు 21 – 40 సంవత్సరాల మధ్య ఉండాలని టామ్‌కామ్ సీఈవో తెలిపారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ అప్డేట్ చేసిన రెస్యూమ్ tomcom.resume@gmail.com మెయిల్‌కి పంపాలని అధికారులు సూచించారు.
రూ. 65వేల జీతంతో పాటు ఇతర అలవెన్సులు కలిసిన ఆకర్షణీయమైన ప్యాకేజీతో సురక్షితమైన, చట్టబద్ధమైన వలస మార్గాల ద్వారా ఈ నియామక ప్రక్రియ జరుగుతుందని ఆయన అన్నారు. మోసకారి ఏజెంట్ల బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని టామ్‌కామ్ సూచించింది.