JEE Mains Ranks | ఏప్రిల్‌ 25న జేఈఈ మెయిన్స్‌ ర్యాంకులు.. NTA తాజా ప్రకటన..

  • Publish Date - April 12, 2024 / 08:33 AM IST

JEE Mains Ranks : ఈ నెల 20న జేఈఈ మెయిన్స్‌ ర్యాంకులు విడుదల చేస్తామని ఇటీవల మద్రాస్‌ ఐఐటీకి సమాచారమిచ్చిన నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ).. ఇప్పుడు ఆ ర్యాంకుల విడుదల తేదీని మరికొంత వెనక్కి జరిపింది. ఈ నెల 25న జేఈఈ మెయిన్ ర్యాంకులను వెల్లడించనున్నట్లు తాజాగా ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నది. జేఈఈ మెయిన్‌ ర్యాంకుల విడుదల తేదీని ఏన్టీఏ అధికారికంగా ప్రకటించడంతో.. తదనుగుణంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తుల ప్రక్రియలో మద్రాస్‌ ఐఐటీ మార్పులు చేసింది.

ఈ నెల 21 నుంచికి బదులుగా ఈ నెల 27 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులు స్వీకరించేలా షెడ్యూల్‌లో మార్పులు చేసింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే ఐఐటీల్లో బీటెక్‌ ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసే అవకాశం కల్పిస్తారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ మద్రాస్‌ నిర్వహిస్తున్నది. జేఈఈ మెయిన్‌ ర్యాంకులను ఏప్రిల్‌ 20న వెల్లడిస్తామని గతంలో ఐఐటీ మద్రాస్‌కు ఎన్‌టీఏ సమాచారమిచ్చింది. దాంతో ఫలితాలు విడుదలైన మరుసటి రోజైన ఏప్రిల్‌ 21 నుంచి 30 వరకు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంచనున్నట్టు గత డిసెంబర్‌ 1న ఐఐటీ మద్రాస్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది.

తాజాగా ఎన్‌టీఏ ఈ నెల 25న జేఈఈ మెయిన్‌ ర్యాంకులు వెల్లడిస్తామని ప్రకటించింది. ఫలితంగా ఐఐటీ మద్రాస్‌ కూడా ఈ నెల 21కి బదులు.. ఈ నెల 27 నుంచి మే 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు స్వీకరించేలా షెడ్యూల్‌లో మార్పు చేసింది. అయితే పరీక్ష మాత్రం యథాతథంగా మే 26న జరుగుతుందని ప్రకటించింది. జేఈఈ మెయిన్‌ చివరి విడత పరీక్షలు ఈ నెల 9న ముగిశాయి. ఈసారి 12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 95 శాతానికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 2.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 2.40 లక్షల మంది పరీక్షలు రాశారు.

Latest News