విధాత, హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదలకు డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని కళాశాలల యజమాన్యాలు మరోసారి ఆందోళనకు సిద్దమయ్యాయి. తెలంగాణలో ఫీజు రీయింబర్స్ మెంట్(Telangana Fee Reimbursement) , స్కాలర్‌షిప్స్ బకాయిలు రూ.10వేల కోట్లకు చేరాయని వెంటనే బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 15నుంచి కాలేజీల నిరవధిక బంద్ నిర్వహణకు ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ను కలిసి నోటీసు అందజేశాయి. ఇంజినీర్స్ డే ను ‘బ్లాక్ డే’ గా పాటించనున్నట్లుగా ప్రకటించాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం వేలకోట్ల ఫీజుల బకాయిలు పెండింగ్ పెట్టిందన్న సీఎం రేవంత్ రెడ్డి.. తమ ప్రభుత్వం ప్రతి ఏడాది నిరవధికంగా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Revanth Reddy Government) ఇచ్చిన హామీ మేరకు బకాయిల విడుదల చేయకపోవడంతో మరోసారి ప్రైవేటు కళాశాలలు(Private Colleges) ఆందోళనకు సిద్దమవుతున్నాయి. తెలంగాణలోని ప్రైవేట్ జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.2,500 కోట్లు కేటాయిస్తోంది. అందులో 40 శాతం అంటే రూ.1,000 కోట్లు నాన్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌ల విద్యార్థులకు కేటాయిస్తోంది. గత మూడు విద్యా సంవత్సరాల్లో మొత్తం రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని…మొత్తం బకాయిలు రూ.10వేల కోట్లకు చేరాయని ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు చెబుతున్నారు.