YIP School | హైదరాబాద్ : హైదరాబాద్( Hyderabad ) నగరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన యంగ్ ఇండియా పోలీసు స్కూల్( YIP School )లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాల నిమిత్తం నోటిఫికేషన్ విడుదలైంది. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించనున్నట్లు స్కూల్ యాజమాన్యం పేర్కొన్నారు.
ఈ పాఠశాలలో పోలీసు కుటుంబాలకు చెందిన పిల్లలకు 50 శాతం సీట్లు కేటాయించనున్నారు. మిగిలిన 50 శాతం సీట్లను సామాన్యుల పిల్లలకు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. పోలీసు కుటుంబాల పిల్లలకు ఏటా రూ. 50 వేలు, ఇతరులకు రూ. 1.6 లక్షల వార్షిక రుసుంగా నిర్ణయించారు.
ప్రస్తుతం ఈ పాఠశాల నార్సింగి( Narsingi ) పరిధిలోని మంచిరేవుల( Manchirevula )లో కొనసాగుతుంది. విద్యార్థుల రాకపోకల కోసం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి బస్సు సదుపాయం కల్పించారు. భవిష్యత్‌లో 50 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న క్యాంపస్‌లో 5 వేల సీట్లతో పాటు 1750 పడకలతో వసతి గృహం ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
అయితే ఈస్కూల్‌లో అకడమిక్ ప్రోగ్రామ్స్‌తో పాటు స్పోర్ట్స్, ఇతర కార్యకలాపాలను సమన్వయంతో నిర్వహిస్తున్నారు. ఆధునిక బోధన పద్ధతులు, విలువల ఆధారిత విద్యావిధానంతో విద్యార్థులు సమగ్ర అభివృద్ధి చెందేలా స్కూల్ ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది.
ఇక అడ్మిషన్ల కోసం yipschool.in వెబ్‌సైట్‌ను లేదా 9059196161 నంబర్‌ను సంప్రదించొచ్చు. దరఖాస్తు నింపే సమయంలో విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఈమెయిల్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రవేశం పొందాలనుకుంటున్న తరగతి నంబర్ కూడా ఇవ్వాలి. ఇక పోలీసు కుటుంబానికి చెందిన పిల్లలా..? లేక సామాన్య కుటుంబాలకు చెందిన పిల్లల అనే వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం దరఖాస్తు సబ్ మిట్ చేయాలి.