విధాత: నటిగా ఇప్పటికే తన సత్తా చాటుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్ నిర్మాతగా…దర్శకురాలిగా కొత్త ప్రయాణం ప్రారంభించారు. ‘సరస్వతి’ అనే థ్రిల్లర్ మూవీని డైరక్ట్ చేసేందుకు మెగా ఫోన్ పట్టారు. తన సోదరి పూజ శరత్ కుమార్ తో కలిసి ‘దోస డైరీస్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. సొంత బ్యానర్ పై స్వీయా దర్శకత్వంలో తొలి చిత్రంగా ‘సరస్వతి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ప్రకాష్ రాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటులుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి వరలక్ష్మి దర్శకత్వం వహించడమే కాకుండా, ప్రధాన పాత్రలోనూ నటిస్తుండటం విశేషం. ఇది ఒక హైయాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనుంది. స్టార్ సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.
తన కొత్త ప్రయాణం గురించి వరలక్ష్మి స్పందిస్తూ.. “దోస డైరీస్ మొదటి పేజీ సరస్వతి మీ ముందుకు రాబోతుంది. మా ప్రయాణం ఈరోజు ప్రారంభమైంది. రాబోయే పేజీలు మరింత ప్రకాశవంతంగా ఉంటాయి” అని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే, పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ దర్శకురాలిగా, నిర్మాతగా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
