హైదరాబాద్: శలాక విద్వత్ సమర్చన 9వ పురస్కారం.. పుంభావ సరస్వతి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారికి విద్వన్మణి.. సరస్వతీ పుత్రులు శ్రీ శలాక రఘునాథ శర్మ దంపతులు మంగళవారం స్వాధ్యాయ గ్రంథాలయ పరిశోధన సంస్థ లో జరిగిన కార్యక్రమంలో అందించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కేవీ రమణాచారి అధ్యక్షత వహించారు. శృంగేరి శంకరాచార్య వారి కరకమలాలతో.. పురస్కారం అందుకొని మహా సన్నిధానం ఆశీస్సులు అందుకొన్న శలాక వారు మహాద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని.. సంస్కృతాంధ్ర సారస్వతాలలో విశేష కృషి చేసిన మహనీయులను గౌరవించటం మన ధర్మం అని రమణాచారి అన్నారు. గత పదేళ్లుగా తాను అన్న జ్ఞాన సమారాధన చేస్తున్నానని.. ఈ సారి.. ఆచార్య సుప్రసన్న గారికి ఈ పురస్కారం అందించటం సంతోషంగా ఉన్నదని తెలిపారు.
ఆచార్య సుప్రసన్న మాట్లాడుతూ తన గురువులు శ్రీ శివానందమూర్తి, విశ్వనాథ సత్యారాయణగారిని గుర్తు చేసుకున్నారు. సాహిత్యాన్ని, సంస్కృతిని ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది అని అన్నారు. ఈ కార్య్రమంలో శ్రీపే రంబుడూరు శ్రీరంగాచార్యులు, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆచార్య యాదగిరి, డాక్టర్ అక్కిరాజు సుందర రామ కృష్ణ, డాక్టర్ వఝల రంగాచార్య, ముత్యం రామ్మోహన్, డాక్టర్ వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.