Director | సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. దర్శకుడిగా పరిచయం అవుతూ ఇటీవల తన తొలి సినిమాను ప్రారంభించిన కీర్తన్ నాదగౌడ కుటుంబంలో తీరని దుఃఖం చోటుచేసుకుంది. కీర్తన్ నాదగౌడ నాలుగున్నరేళ్ల కుమారుడు సోనార్ష్ కె. నాదగౌడ లిఫ్ట్‌లో ఇరుక్కొని మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో కీర్తన్ నాదగౌడ, ఆయన భార్య సమృద్ధి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రమాదవశాత్తూ చిన్నారి సోనార్ష్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. కొంతసేపటి తర్వాత తీవ్ర గాయాలతో బయటకు తీసినప్పటికీ, అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. నాలుగున్నరేళ్ల చిన్నారి అకాల మరణం కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా సినీ పరిశ్రమను కూడా కలచివేసింది.
కీర్తన్ నాదగౌడ కన్నడ సినీ పరిశ్రమలో అనేక సినిమాలకు దర్శకత్వ విభాగంలో పనిచేశారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘కేజీఎఫ్’ చిత్రానికి సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పని చేసి గుర్తింపు పొందారు. ఎన్నో ఏళ్ల అనుభవం తర్వాత ఇటీవలే దర్శకుడిగా తొలి అడుగు వేస్తూ, తెలుగు–కన్నడ భాషల్లో ఓ హారర్ సినిమాను ప్రకటించారు. ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ హారర్ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే ఘనంగా జరిగాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ కూడా కొనసాగుతున్నట్లు సమాచారం. దర్శకుడిగా తొలి సినిమా తెరకెక్కుతుందనే సంతోష సమయంలోనే ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం కీర్తన్ నాదగౌడ కుటుంబాన్ని తీవ్రంగా కుదిపేసింది.
ఈ విషాద వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు చిన్నారి సోనార్ష్‌కు నివాళులు అర్పిస్తూ, కీర్తన్ నాదగౌడ కుటుంబానికి సంతాపం తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ వేదికగా తన సంతాపాన్ని ప్రకటిస్తూ, ఈ కష్టం నుంచి కుటుంబం త్వరగా తేరుకోవాలని ఆకాంక్షించారు. చిన్నారి సోనార్ష్ అకాల మరణం సినీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒకవైపు కెరీర్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న సమయంలో, మరోవైపు జీవితంలో ఇలాంటి తీరని లోటు ఏర్పడడం పట్ల సినీ పరిశ్రమ మొత్తం విచారం వ్యక్తం చేస్తోంది. కీర్తన్ నాదగౌడ కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
