Prabhas | టాలీవుడ్‌లో పాన్–ఇండియా స్టార్‌గా ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న ప్రభాస్.. కల్కి 2898 ఏడి తర్వాత సినిమాల వేగం పెంచాడు. ఈ క్రమంలో మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రాజాసాబ్’ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు . సంజయ్ దత్, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, సముద్రఖని, జరీనా వాహెబ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో ఒక విభిన్నమైన చిత్రంగా నిలవనుంది. రొమాంటిక్ హారర్ కామెడీ జానర్‌లో ఇది డార్లింగ్ తొలిసారి చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
జనవరి 9 రిలీజ్… కానీ పరిస్థితి ఎలా ఉంది?
సంక్రాంతి బరిలోకి ఈ సినిమా వస్తుందని టీమ్ మొదటి నుంచే చెప్పుకుంటూ వస్తుంది.ఇటీవల కూడా చిత్రం జనవరి 9న ఖచ్చితంగా విడుదలవుతుందని నిర్మాతలు అంటున్నారు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం దీనిపై చాలా సందేహాలే ఉన్నాయి.
ప్రధాన కారణాలు ఇవి:
అప్‌డేట్స్ లేకుండా ..
ఆరంభం నుంచి సినిమాకి సంబంధించి టీమ్ విడుదల చేసిన అప్‌డేట్స్ చాలా తక్కువ. ఒకటిరెండు పోస్టర్స్, ఒక టీజర్ తప్ప పెద్దగా ప్రమోషన్ లేకపోవడం అభిమానులను ఇబ్బందిపెడుతోంది. ట్రైలర్ విడుదల తర్వాత కూడా టీమ్ మళ్లీ సైలెంట్ అయిపోవడం మరింత అనుమానాలకు దారితీసింది.
షూటింగ్ పూర్తైందా?
కొంతకాలం ప్రభాస్ షూట్‌కు హాజరవడం లేదనే వార్తలు ఆ మధ్య వినిపించాయి. ఆ తర్వాత ప్రభాస్ తో షూటింగ్ పార్ట్ పూర్తిచేసినట్టు ప్రచారం జరిగిన, తాజా పరిస్థితులు చూస్తే మొత్తం సినిమా షూట్ ముగిసిందా అన్న డౌట్ ఇంకా కొనసాగుతోంది.
పాన్ ఇండియా ప్రమోషన్స్ కనిపించకపోవడం
జనవరి 9 రిలీజ్ అని చెబుతుంటే, భారీ రేంజ్ ప్రమోషన్స్ జరగాల్సిందే. కానీ ప్రస్తుతం ప్రమోషన్స్ ఏ నగరంలోనూ కనిపించకపోవడం గమనార్హం.
ప్రధాన బిజినెస్ డీల్స్ ఇంకా పెండింగ్?
డిజిటల్, శాటిలైట్, ఓవర్సీస్, నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ వంటి పలు కీలక డీల్స్ ఇంకా పూర్తికాలేదని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇవి పూర్తి కాకుండా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయడం చాలా ప్రమాదకరమని విశ్లేషకుల అభిప్రాయం.
ప్రభాస్ లైనప్‌కు కూడా ప్రభావం?
‘రాజాసాబ్’ వాయిదా పడితే ప్రభాస్ రాబోయే సినిమాల విడుదలలో కూడా గందరగోళానికి గురయ్యే అవకాశముందని వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ తర్వాత లైనప్‌లో ఉన్న సినిమాలుచూస్తే.. ఫౌజీ, సలార్ 2, కల్కి సీక్వెల్‌తో పాటు ఇతర ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. సినిమా వాయిదా పడితే మొత్తం షెడ్యూల్ మారిపోవచ్చు.మరోవైపు జనవరి 9న రాబోయే మరో సినిమా ‘జన నాయగన్’ దళపతి విజయ్ చివరి చిత్రం కాగా, ఈ చిత్రం ప్రభాస్ మూవీకి పోటీ ఇస్తుందా అనే చర్చ కూడా నడుస్తుంది. అయితే నిర్మాతలు ఎట్టి పరిస్థితుల్లోనైనా జనవరి 9న రాజా సాబ్‌ని తీసుకొస్తామని ధీమాగా చెబుతున్నారు. కానీ టీమ్ సైలెంట్ కావడం, ప్రమోషన్స్ లేకపోవడం, డీల్స్ పెండింగ్‌లో ఉండటం వంటి అంశాలు విడుదలపై భారీ సందేహాలు రేకెత్తిస్తున్నాయి.
