Raja Saab Collections | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను నమోదు చేస్తోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రారంభ రోజు మంచి ఓపెనింగ్ అందుకున్నప్పటికీ, రెండో రోజుకు వచ్చేసరికి వసూళ్లలో స్పష్టమైన తగ్గుదల కనిపించింది. రిలీజ్ అయిన తొలి రోజు (ప్రీమియర్ షోలు మినహా) దేశవ్యాప్తంగా ఈ సినిమా సుమారు 53.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ సాధించింది. అయితే రెండో రోజు మాత్రం కేవలం 27.83 కోట్ల రూపాయలకే పరిమితమైంది. మొదటి రోజుతో పోలిస్తే దాదాపు 48 శాతం వరకు డ్రాప్ నమోదైంది. ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కలుపుకుంటే, రెండు రోజుల మొత్తం ఇండియా కలెక్షన్ 90.73 కోట్ల రూపాయల వద్ద ఆగింది. దీంతో 100 కోట్ల మార్క్‌ను వెంటనే దాటుతుందని అంచనా వేసిన ట్రేడ్ వర్గాలకు కొంత నిరాశ ఎదురైంది.
ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం హిందీ వెర్షన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. హిందీలో మొదటి రోజు సుమారు 6 కోట్లు, రెండో రోజు 5.2 కోట్లు మాత్రమే వసూలు చేయడంతో రెండు రోజుల కలెక్షన్ 11.2 కోట్లకు పరిమితమైంది. ఇక ఇతర భాషా వెర్షన్ల విషయానికి వస్తే, తెలుగు వెర్షన్ ప్రధానంగా ఆదాయాన్ని తీసుకువస్తుండగా, తమిళం, మలయాళం, కన్నడ మార్కెట్లలో వసూళ్లు నామమాత్రంగానే నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, ‘ది రాజా సాబ్’ తొలి రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినప్పటికీ, రెండో రోజు వేగం తగ్గింది. రెండు రోజుల వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్ మొత్తం 138.4 కోట్ల రూపాయల వరకు మాత్రమే చేరింది.
అంటే రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆదాయం సుమారు 30 కోట్ల రూపాయలకే పరిమితమైంది. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడ రెండు రోజుల్లో మొత్తం 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ నమోదు కాగా, ఇందులో ఎక్కువ భాగం తొలి రోజే రావడం గమనార్హం. మొత్తంగా చూస్తే, ‘ది రాజా సాబ్’కు ఓపెనింగ్ బలంగా ఉన్నప్పటికీ, కంటెంట్‌పై వచ్చిన మిక్స్‌డ్ టాక్ కారణంగా రెండో రోజు నుంచే వసూళ్లలో తగ్గుదల కనిపిస్తోంది. రానున్న వీకెండ్, మౌత్ టాక్‌పై ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఎంతవరకు నిలబడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
