Samantha | రోజురోజుకీ అభిమానుల అత్యుత్సాహం సెలబ్రిటీలకు, ముఖ్యంగా హీరోయిన్లకు ఇబ్బందిగా మారుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల ‘ది రాజాసాబ్’ సాంగ్ రిలీజ్ వేడుకలో నటి నిధి అగర్వాల్ ఎదుర్కొన్న ఘటన మరువకముందే, తాజాగా అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభుకూ ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
చేదు అనుభవం..
తాజాగా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత హాజరయ్యారు. ఇటీవలే దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న అనంతరం సమంత మొదటిసారి పబ్లిక్ ముందుకు రావడంతో ఆమెను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మాల్ ఓపెనింగ్ కార్యక్రమం ముగిసిన తరువాత కార్ వైపు వెళ్తున్న సమంత వద్దకు సెల్ఫీల కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు.
కారు వరకు తీసుకెళ్లడానికి చాలా నరకం..
అత్యధిక రద్దీతో పరిస్థితి అదుపు తప్పడంతో సమంతను కారు వరకు తీసుకెళ్లేందుకు ఆమె బాడీగార్డ్స్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో సమంత ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఇటీవల సెలబ్రిటీల పట్ల అభిమానులు చూపుతున్న ఈ రకమైన ప్రవర్తనపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభిమానమంటే గౌరవం ఉండాలే తప్ప, వ్యక్తిగత స్థలాన్ని ఉల్లంఘించడం సరికాదని పలువురు మండిపడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇలాంటి ఘటనలు తరచూ జరగడం ఆందోళన కలిగిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొన్న నిధి అగర్వాల్, ఇప్పుడు సమంత.. వరుసగా నటీమణులకు ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవాలే ఎదురవడం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా, చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత ‘శుభం’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించడమే కాకుండా నిర్మాతగానూ సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఆమె ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అలాగే డిసెంబర్ 1న దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సమంత, కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో ఉన్న లింగ భైరవి ఆలయంలో భూత శుద్ధి వివాహం చేసుకుంది. ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని సర్దుబాటు చేసుకుంటూ, తిరిగి తన కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
