Shivaji | బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివాజీ. అంచెలంచెలుగా ఎదిగి అగ్ర కథానాయకుల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ హీరో స్థాయికి చేరుకున్నారు. నటనతో పాటు రాజకీయాలు, సమాజంపై నిర్మొహమాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం శివాజీకి ప్రత్యేకత. నచ్చినా నచ్చకపోయినా తనకు అనిపించినదాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పే స్వభావం వల్ల ఆయన వ్యాఖ్యలు తరచూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
బిగ్‌బాస్ షోతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన శివాజీ, ఇటీవల ‘కోర్టు’ సినిమాలో విలన్ పాత్రతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇటు వెండి తెర, అటు బుల్లితెరపై వరుస సినిమాలు, షోలతో బిజీగా ఉన్న ఆయన, కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘దండోరా’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి జరిగిన ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
ఈ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై మాట్లాడిన శివాజీ, “గ్లామర్ పేరుతో హద్దులు దాటొద్దు. మీ అందం చీరలోనో, నిండుగా కప్పుకునే దుస్తుల్లోనో ఉంటుంది. సామాన్లు కనిపించే బట్టల్లో కాదు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. వేదికలపై హీరోయిన్లు పద్ధతిగా ఉండాలని సూచించిన ఆయన, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు, హద్దులు దాటిన డ్రెస్సింగ్‌పై అసహనం వ్యక్తం చేశారు.
“అలాంటి బట్టలు వేసుకుంటే బయటికి నవ్వుతూ బాగున్నారని అంటారు. కానీ లోపల మాత్రం ‘ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకుంది, కాస్త మంచివి వేసుకుంటే ఇంకా బాగుంటుందికదా’ అనిపిస్తుంది. అయితే అలా మాట్లాడలేం. మాట్లాడితే వెంటనే స్త్రీ స్వాతంత్య్రం, స్వేచ్ఛ అంటూ ఉద్యమాలు మొదలవుతాయి” అని వ్యాఖ్యానించారు. అలాగే, “స్త్రీ అంటేనే ప్రకృతి అందం. ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. స్త్రీ అంటే అమ్మకు ప్రతిరూపం. ఆమె ఎప్పటికీ నా గుండెల్లో ఉంటుంది” అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా పాతతరం నటీమణులను గుర్తు చేస్తూ, సావిత్రి, సౌందర్య వంటి మహానటులు ఇప్పటికీ గుర్తుండిపోవడానికి కారణం వారి పద్ధతి, నటన, గౌరవమేనని శివాజీ అన్నారు. “గ్లామర్ ఉండాలి కానీ, ఒక లిమిట్ వరకే. మన వేషభాష నుంచే మన గౌరవం వస్తుంది. ప్రపంచ వేదికలపై కూడా చీర కట్టుకున్న వారికే విశ్వసుందరి కిరీటాలు వచ్చాయి” అంటూ సంప్రదాయ దుస్తుల గొప్పతనాన్ని హైలైట్ చేశారు.
శివాజీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన మాటల్లో నిజం ఉందని, భారతీయ విలువలను గుర్తు చేశారని మద్దతు తెలుపుతుంటే, మరికొందరు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తీవ్రంగా విమర్శిస్తున్నారు. శివాజీ చేసిన వ్యాఖ్యలు సమాజాన్ని ఆలోచింపజేస్తాయా? లేక మరో వివాదానికి నాంది పలుకుతాయా? అన్నది వేచి చూడాల్సిందే
Heroines eey Battalu Padithe Aa Battalu Esukokandi. Cheeralone Andham, Gouravam Vundhi. Samanlu Kanipinche battalo kaadhu
– #Sivaji at #Dhandoraa Pre Release
pic.twitter.com/ACriYpvhxd— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) December 22, 2025
