Tollywood | 2025 చివరి శుక్రవారం.. థియేటర్లలో సినిమాల పండగ..క్రిస్మస్ కానుకగా రానున్న సినిమాలివే!

Tollywood |  2025 సంవత్సరం సినీ పరిశ్రమకు ఎన్నో మలుపులు తిప్పింది. భారీ అంచనాలతో విడుదలైన కొన్ని స్టార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచగా, ఎలాంటి హైప్ లేకుండా వచ్చిన కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి

Tollywood |  2025 సంవత్సరం సినీ పరిశ్రమకు ఎన్నో మలుపులు తిప్పింది. భారీ అంచనాలతో విడుదలైన కొన్ని స్టార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచగా, ఎలాంటి హైప్ లేకుండా వచ్చిన కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. స్టార్ పవర్‌తో పాటు బలమైన కథే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలదని ఈ ఏడాది మరోసారి రుజువైంది.ఇలాంటి నేపథ్యంలో 2025 చివరి శుక్రవారం, క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదల కానున్న సినిమాలపై ఆసక్తి నెలకొంది. విభిన్న జానర్లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సినిమాలివే.

ఛాంపియన్ (Champion)

సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన చిత్రం ‘ఛాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. ఫుట్‌బాల్ నేపథ్యంతో రూపొందిన ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా యువతను ఆకట్టుకునేలా భావోద్వేగాలు, స్పోర్ట్స్ అంశాల మేళవింపుతో రూపొందింది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి స్వప్న సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

శంభాల (Shambhala)

హారర్, సస్పెన్స్, బలమైన ఎమోషన్స్‌తో రూపొందిన సినిమా ‘శంభాల’. ఆది సాయికుమార్ హీరోగా యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. ఊహించని ట్విస్టులతో కథ సాగుతుందని మేకర్స్ చెబుతుండటంతో థ్రిల్లర్ అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.

ఈషా (Eesha)

‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి చిత్రాల తర్వాత బన్నీ వాస్, వంశీ నందిపాటి నిర్మిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు. కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది.

దండోరా (Dhandoraa)

‘కలర్ ఫోటో’, ‘బెదురులంక 2012’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన తాజా చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం కూడా డిసెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది.

పతంగ్ (Patang)

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మూవీ ‘పతంగ్’. ప్రీతీ పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించారు. ప్రముఖ సింగర్ ఎస్పీ చరణ్ కీలక పాత్రలో కనిపించనుండటం విశేషం. డి. సురేష్ బాబు సమర్పణలో రూపొందిన ఈ సినిమా కూడా క్రిస్మస్ రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది.

వృషభ (Vrusshabha)

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘వృషభ’. నందకిశోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, బాలాజీ మోషన్ పిక్చర్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. తెలుగులో గీతా ఆర్ట్స్ ద్వారా అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.

ఓటీటీల్లోనూ వినోదాల సంద‌డి

థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో కూడా ఈ వారం కొత్త కంటెంట్ సందడి చేయనుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 వంటి ప్లాట్‌ఫాంలలో పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా చూస్తే 2025 చివరి వారం ప్రేక్షకులకు థియేటర్లు, ఓటీటీల్లో నిజమైన సినిమాల పండగ అని చెప్పొచ్చు.

Latest News