Ram Gopal Varma : రాజమౌళి వ్యాఖ్యలపై దేవుడికి లేని బాధ మీకెందుకు

రాజమౌళి దేవుడిపై వ్యాఖ్యలపై హిందూ సంఘాల నిరసనల మధ్య, వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ ప్రతి ఒక్కరికీ నమ్మకం లేదా నమ్మకపోవడం హక్కు అని ట్వీట్ చేశాడు.

RGV

విధాత : మహేష్ బాబు సినిమా వారణాసి ఈవెంట్ లో దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి దేవుడిపై నమ్మకం లేదంటూ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు వ్యక్తం చేస్తున్న నిరసనలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ఎక్స్ వేదికగా స్పందించారు. వర్మ తన ట్వీట్ లో రాజమౌళి నాస్తికుడు అని తెలిసినా ఆయనపై విషం కక్కడం సరికాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేవుడిని నమ్మకపోవడం నేరం కాదు. నమ్మే హక్కు మీకు ఎంత ఉందో, నమ్మకపోవడానికి ఆయనకు అంతే హక్కు ఉంది అని స్పష్టం చేశారు. రాజమౌళి వ్యక్తిగత నమ్మకాలను ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదని ఆయన పేర్కొన్నారు.

దేవుడిని నమ్మనప్పుడు సినిమాల్లో దేవుడిని ఎందుకు చూపిస్తున్నాడు? అని ప్రశ్నించే వారికి వర్మ తనదైన లాజిక్ తో సమాధానం ఇచ్చారు. గ్యాంగ్ స్టర్ సినిమా తీయాలంటే దర్శకుడు గ్యాంగ్ స్టర్ అవ్వాలా? హారర్ సినిమా తీయాలంటే దెయ్యం అవ్వాలా?” అని ఎద్దేవా చేశారు. సినిమా అనేది ఒక క్రియేటివ్ ప్రాసెస్ అని, దానికి వ్యక్తిగత నమ్మకాలకు సంబంధం లేదని వర్మ అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా రాజమౌళికి దక్కిన సక్సెస్ గురించి కూడా వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “రాజమౌళి దేవుడిని నమ్మకపోయినా, దేవుడు అతనికి 100 రెట్లు ఎక్కువ సక్సెస్, డబ్బు, కీర్తిని ఇచ్చాడు. చాలామంది భక్తులకు వంద జన్మలెత్తినా దక్కని భాగ్యం ఆయనకు దక్కింది” అని అన్నారు. దీన్ని బట్టి దేవుడికి నాస్తికులంటే ఇష్టమా? లేక దేవుడు ఇవన్నీ పట్టించుకోడా? అని వర్మ వ్యగ్యంగా ప్రశ్నించారు.

రాజమౌళి నాస్తికత్వం దేవుడిని తగ్గించదని, కానీ నమ్మకం లేని వారిని చూసి భయపడే భక్తుల అభద్రతా భావాన్ని బయటపెడుతుందని వర్మ వ్యాఖ్యానించారు. దేవుడు క్షేమంగానే ఉన్నాడు, రాజమౌళి కూడా క్షేమంగానే ఉన్నాడు. మధ్యలో అనవసరంగా బాధపడేది కేవలం అర్థం చేసుకోలేని వాళ్ళు మాత్రమే” అని చురకలు అంటించారు. చివరగా, ‘వారణాసి’ సినిమాతో రాజమౌళి బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకా పెరుగుతుందని, అసూయపడే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారని వర్మ ముగించారు. ఈ మొత్తం గొడవ వెనుక భక్తి ముసుగులో ఉన్న అసూయ దాగి ఉందని ఆయన తేల్చిచెప్పారు. అలాగే చివరలో “జై హనుమాన్” అంటూ ట్వీట్ ని ముగించారు.

Latest News